Shikhar Dhawan Acting Debut: క్రికెట్ మైదానంలో ఫోర్లు, సిక్సర్లు బాది అభిమానులను అలరిస్తున్న టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ రూపొందిస్తున్న చిత్రంలో ధావన్ కీలక పాత్ర పోషిస్తున్నారట. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందట. ఇది పూర్తి స్థాయి పాత్ర అని, గెస్ట్ రోల్ కాదని తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ చిత్రం పేరు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
Shikhar Dhawan News: శిఖర్ ధావన్ గతేడాది అక్టోబర్‌లో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న రామసేతు సినిమా సెట్లో కన్పించాడు. అయితే ధావన్ నటిస్తున్నది ఈ సినిమాలో కాదని తెలుస్తోంది. అక్షయ్ కుమార్, ధావన్ మంచి స్నేహితులు. సరదాగా షూటింగ్ చూసేందుకే ధావన్ రామసేతు సెట్‌కి వెళ్లినట్లు సమాచారం. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌తోనూ ధావన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. గతేడాది డిసెంబర్లో రణ్వీర్ను కలిసిన ఫొటోను షేర్ చేశాడు ధావన్. చాలా కాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందన్నాడు. అప్పుడు విడుదలైన '83' సినిమా అద్భుతంగా ఉందని, సినిమా హిట్ అయినందుకు రణ్‌వీర్‌కు అభినందనలు తెలిపాడు.