Sikhar Dhawan: ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ కోచ్ రవిశాస్త్రి శైలిపై కామెంట్స్ చేశాడు శిఖర్ ధావన్. "ఇద్దరి ఎనర్జీ పూర్తి విరుద్ధం. ప్రతి ఒక్కరికి తమ వ్యక్తిత్వం ఉంటుంది. రవిశాస్త్రి ఉంటే అక్కడి వాతావరణం వేరుగా ఉంటుంది. అయితే ఇద్దరితోనూ అనుబంధం ఉంది. రాహుల్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది" అని పేర్కొన్నాడు.
ఇక వన్డేల్లో సుస్థిర స్థానం దక్కించుకుంటూ.. టీమ్‌ఇండియా-బీ జట్టుకు సారథిగా వ్యవహరించే ధావన్ టీ20ల్లో మాత్రం టీమ్‌లో ఉండలేకపోతున్నాడు. సెలెక్షన్ కమిటీ కూడా ధావన్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అయితే ఎందుకు ఎంపిక చేయడంలేదో తనకీ తెలియదంటున్నాడు ఈ ఓపెనర్. కేవలం తన పరిధిలోని విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తానని, మిగతావాటిని పట్టించుకోనని ధావన్ వెల్లడించాడు. కేవలం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టిసారిస్తానని తెలిపాడు.
"టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు. అయితే ఏదొక కారణమైతే ఉండే ఉంటుంది. దీనిపై లోతుగా ఆలోచించను. ఎందుకు చాలా కాలంగా భారత్ జట్టుకు టీ20ల్లో దూరంగా ఉన్నానో అర్థం కావడం లేదు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టిపెడతా. అది భారత టీ20 లీగ్.. వన్డేలు.. ఇతర ఏ మ్యాచ్ అయినా సరే రాణించడంపైనే ఆలోచిస్తా. అదే మన నియంత్రణలో ఉండే అంశం" అని ధావన్ పేర్కొన్నాడు.
వన్డే క్రికెట్ ఆడటం తనకెంతో ఇష్టమని, ఇప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్ ప్రభ కొనసాగుతుందని తెలిపాడు ధావన్. టెస్టులు, టీ20లు.. వేటికవే ప్రత్యేక గుర్తింపు ఉందని, అలాగే వన్డే క్రికెట్‌కు ఉందని వివరించాడు. విరాట్ కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్ చాలని, అతడొక ఛాంపియన్.. తప్పకుండా ఫామ్‌లోకి వస్తాడని ధావన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ధావన్ ఇటీవల శ్రీలంక, వెస్టిండీస్‌లతో జరిగిన వన్డే సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే ఆగస్టు 18 నుంచి జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు సారథిగా ధావన్ ఎంపికయ్యాడు.
ఇదీ చూడండి:CWG 2022: ఈ అథ్లెట్లకు ఆకాశమే హద్దు.. కష్టాల కడలి దాటి.. పతకాలను ముద్దాడి!