టీమ్ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శాంతకుమారన్ శ్రీశాంత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్‌లో ఈ కేరళ ఆటగాడు దర్శనమివ్వనున్నాడట. కానీ, మ్యాచ్‌లు ఆడేందుకు బ్యాట్, బాల్‌లు పట్టుకోవడానికి కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తన ప్యానెల్లో చర్చా సభ్యులుగా వ్యవహరించే వారి పేర్ల జాబితాను తాజాగా ప్రకటించింది. అయితే ఈ లిస్ట్‌లో ఎస్.శ్రీశాంత్ పేరు కూడా ఉండడం విశేషం.
ఐపీఎల్ 2013 సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు శ్రీశాంత్. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కనిపించలేదు ఇతడు. దీంతో శ్రీశాంత్‌పై అప్పట్లో మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది కోర్టు. అనంతరం కేసును కొట్టివేయడంతో కాస్త ఊరట లభించింది ఇతడికి. అయితే క్రికెట్ కెరీర్‌కి శ్రీశాంత్ విరామం చెప్పి కేవలం ఏడాది మాత్రమే అయ్యింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ తాజా నిర్ణయంతో సరిగ్గా పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో సందడి చేయనున్నాడు ఈ కేరళ ప్లేయర్. అయితే స్టార్ స్పోర్ట్స్ మలయాళ ఛానెల్‌లో శ్రీశాంత్ వ్యూయర్ అనలిస్ట్‌గా వ్యవహరించనున్నాడు. దీని ద్వారా 10 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు శ్రీశాంత్.
శ్రీశాంత్‌తో పాటు ఈసారి స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్ జాక్వెస్ కలిస్, ఆస్ట్రేలియన్ ఆటగాడు ఆరోన్ ఫించ్, ఇంగ్లాండ్ క్రికెటర్స్ కెవిన్ పీటర్సన్, పాల్ కాలింగ్‌వుడ్, మరో ఆస్ట్రేలియన్ ఆటగాడు టామ్ మూడీ, భారత మాజీ ప్లేయర్స్ ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, మురళీ విజయ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్లు కూడా కనిపించనున్నారు.