Shami World Cup 2023 :వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచి వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు ఓటమిపాలైంది. దీంతో యావత్ దేశం తీవ్ర నిరాశకు గురైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి మరీ ఆటగాళ్లను సముదాయించారు. తాజాగా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
షమీ ఈ మెగా సమరంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే తాము ఫైనల్‌లో ఏం పొరపాటు చేశామనేది ఇప్పటికీ అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. "దేశమంతా ఈ ఓటమితో తీవ్ర నిరుత్సాహానికి గురైంది. అభిమానులు ఎన్నో అంచనాలు పెంచుకున్నారు. మేం కూడా కప్‌ను సాధిద్దామనే లక్ష్యంతో బరిలోకి దిగాం. వందశాతం శ్రమించి ఫైనల్‌కు చేరాం. అక్కడా విజేతగా నిలవాలని కలలుగన్నాం. కానీ, అంచనాలు తారుమారయ్యాయి. మా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎక్కడ పొరపాటు జరిగిందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేదు" అని షమీ తెలిపాడు.