Shahid Afridi comments on Shaheen :2023లో జరిగిన వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఘోర వైఫల్యం చెందింది. అయితే ఆ తర్వాత పాక్ జట్టులో పలు మార్పులు జరిగాయి. కోచింగ్ సిబ్బందిని మార్చడం సహా బాబర్ అజామ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. పేసర్ షాహీన్ అఫ్రిదిని టీ20 సారథిగా నియమించారు. పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఇటీవల ఓ కార్యక్రమంలో షాహీన్ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్‌పై ప్రశంసలు కురిపించిన షాహిద్ తన అల్లుడు షాహీన్ పొరపాటున కెప్టెన్ అయ్యాడని అన్నాడు. షాహిద్ అఫ్రిది కుమార్తెను షాహీన్ కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.
''నాకు మహ్మద్ రిజ్వాన్ అంటే చాలా ఇష్టం. ఆటపై నిబద్ధత ఉండటం, దానికో కఠినంగా శ్రమించడం అతడిని ఉత్తమ క్రికెటర్‌గా నిలిపాయి. ఎవరు ఏ చేస్తున్నారు అనే విషయాలను పట్టించుకోకుండా కేవలం ఆటపైనే దృష్టి పెడతాడు. అదే నాకు అతడిలో ఎక్కువగా నచ్చే అంశం. మహ్మద్ రిజ్వాన్ నిజంగా ఒక పోరాట యోధుడు! అతడిని నేను టీ20 కెప్టెన్‌గా చూడాలనుకున్నాను. కానీ, పొరపాటున షాహీన్ అఫ్రిది సారథి అయ్యాడు'' అని షాహిద్ అఫ్రిది చెప్పాడు. దీంతో అక్కడే వేదికపై ఉన్న షాహీన్, హారిస్ రవూఫ్, సర్ఫరాజ్ అహ్మద్‌తోపాటు కార్యక్రమానికి హాజరై వారు ఒక్కసారిగా నవ్వారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.