ఈతరం క్రికెటర్ల మానసిక వైఖరిలో మార్పును టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్ ప్రశ్నించారు. ఐతే క్రికెట్ పరిణామంలో అది అంగీకార యోగ్యమేనని అన్నారు. నాలుగు ఓవర్లు వేయగానే బౌలర్లు అలసిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
"ఏడాదిలో పది నెలలు క్రికెట్ ఆడితే ఎక్కువ గాయపడతారు! కానీ, ఈనాటి క్రికెట్ సులభ స్థాయికి మారింది. బ్యాటు లేదా బంతితో సత్తా చాటితే చాలు. అదే మా తరంలో మేం ఇంకా ఎన్నో చేయాల్సి వచ్చేది. ఈనాటి క్రికెట్ మారిపోయింది. కొన్నిసార్లు బౌలర్ నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోవడం చూస్తే బాధేస్తోంది. వారికి మూడు, నాలుగు ఓవర్లకు మించి బంతి ఇవ్వడం లేదన్న సంగతి నా చెవిన పడింది. మా తరంలో ఎలా ఉండేదో గుర్తొస్తోంది. అది తప్పో ఒప్పో నేను చెప్పడం లేదు. నెట్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు వచ్చే ఆఖరి ఆటగాడికీ మేం పది ఓవర్లు విసిరేవాళ్లం. అలాంటి వైఖరి అభివృద్ధి చేసుకోవాలి. అలా సాధన చేస్తేనే కండరాలు బలపడతాయి. ఇప్పటి వాళ్లకు నాలుగు ఓవర్లు విసిరితే చాలనిపిస్తోంది. కానీ, మా తరం వాళ్లకి అది కాస్త వింతగా ఉంటుంది".