Vinod kambli financial: కరోనా తర్వాత కుటుంబ పోషణ భారంగా మారిందని.. బీసీసీఐ ఇస్తున్న రూ. 30 వేల పింఛన్‌తోనే తాను నెట్టుకొస్తున్నానని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లి చెప్పాడు. కుటుంబాన్ని పోషించడానికి తాను కష్టాలు పడుతున్న సంగతి దిగ్గజ ఆటగాడు, తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ తెందుల్కర్‌కు తెలుసని అన్నాడు. సచిన్ గొప్ప స్నేహితుడని.. అతని నుంచి ఏమీ ఆశించట్లేదని తెలిపాడు. తెందుల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీలో (టీఎంజీఏ) కోచ్‌గా ఉద్యోగం లభించినా.. దూరాభారం వల్ల వెళ్లలేకపోతున్నట్లు వివరించాడు.
"ఉదయం 5 గంటలకు లేచి డీవై పాటిల్ స్టేడియానికి క్యాబ్‌లో వెళ్లేవాడిని. బాగా అలసిపోయేవాడిని. దీంతో సాయంత్రం పూట బీకేసీ మైదానంలో శిక్షణకు మారా. ఆట నుంచి రిటైరైన నాకు బీసీసీఐ పెన్షనే ఆధారం. బోర్డు పెన్షన్‌తోనే కుటుంబాన్ని పోషిస్తున్నా. ఇందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు. ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్నా. క్రికెట్ పురోగతి కమిటీ (సీఐసీ)లో నాకు స్థానం కల్పించారు. కాని అది గౌరవపూర్వక హోదా. నా కుటుంబాన్ని పోషించాలంటే ఆదాయం కావాలి. ఏదైనా పని ఉంటే చెప్పమని ఎంసీఏను చాలాసార్లు అడిగా. నా పరిస్థితి గురించి సచిన్‌కు పూర్తిగా తెలుసు. అతని నుంచి నేను ఏమీ ఆశించట్లేదు. టీఎంజీఏలో పని కల్పించాడు. అందుకు నేను సంతోషంగా ఉన్నా. అతనో గొప్ప స్నేహితుడు. ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటాడు" అని కాంబ్లి వివరించాడు.