క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ మరో ఘనత సాధించాడు. ప్రముఖ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఎంపిక చేసిన గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్ ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇతడితో పాటు జాక్వెస్ కలిస్, స్టీవ్ స్మిత్, రికీ పాంటింగ్ ఇందులో చోటు కైవసం చేసుకున్నారు.
- టెస్టుల్లో సచిన్ మొత్తంగా 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి. రన్స్‌తో పాటు శతకాల పరంగా సచిన్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. పరుగుల విషయంలో అతనికి చేరువలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ దగ్గర్లో ఉన్నాడు. తెందూల్కర్ కంటే 2,543 పరుగులు తక్కువగా నమోదు చేశాడు. ఇక సెంచరీల విషయానికొస్తే దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్.. సచిన్‌కు చేరువలో ఉన్నాడు. అతడు టెస్టుల్లో 45 శతకాలు బాదాడు.
ఇక అత్యుత్తమ బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ను అగ్రస్థానం వరించింది. ఇతడితో పాటు షేన్ వార్న్, డెయిల్ స్టెయిన్, మెక్‌గ్రాత్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
- మురళీధరన్ తన టెస్టు కెరీర్లో 800 వికెట్లు సాధించి ఈ ఫార్మాట్లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. షేన్ వార్న్ 708 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.