Rohit Virat Rahul Against South Africa Test :సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌ను టీమ్ఇండియా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సఫారీ గడ్డపై తొలి సిరీస్ సాధించిన భారత జట్టుగా నిలవాలని టీమ్ఇండియా తహతహలాడుతోంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కీలకం కానున్నారు. ప్రస్తుత జట్టులోనూ అనుభవం ఉన్న బ్యాటర్లు వీళ్లే కావడం విశేషం. మరి ఇదివరకు సౌతాఫ్రికాలో జరిగిన టెస్టుల్లో ఎవరి ప్రదర్శన ఎలా ఉందో చూద్దాం.
రోహిత్ శర్మ : సఫారీ గడ్డపై టెస్టుల్లో రోహిత్ రికార్డు అంతగా ఆశించిన స్థాయిలో లేదు. గతంలో రోహిత్ 2013-14, 2017-18 సిరీస్‌ల్లో రెండేసి మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో రోహిత్ కేవలం 123 పరుగులే చేశాడు. అందులో 47 పరుగులు టాప్ స్కోర్. ఇక ఓవరాల్‌గా చూస్తే సౌతాఫ్రికాపై రోహిత్‌కు మెరుగైన రికార్డే ఉంది. సఫారీలతో రోహిత్ 9 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 42.37 సగటుతో 678 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఆ మూడు సెంచరీలు కూడా 2019-20 స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రావడం గమనార్హం.
విరాట్ కోహ్లీ : సౌతాఫ్రికాలో విరాట్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఏడు టెస్టు మ్యాచ్‌ల్లో విరాట్ 51.35 సగటుతో 719 పరుగులు బాదాడు. 2013లో తొలిసారి సఫారీ గడ్డపై ఆడిన విరాట్ మొదటి మ్యాచ్‌లోనే 272 పరుగులు చేశాడు. తర్వాత 2017-18 సిరీస్‌లో 286 పరుగులు, 2021-22 సిరీస్‌లో 161 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా 14 మ్యాచ్‌ల్లో 56.18 సగటుతో 1236 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీమ్ఇండియాలో సౌతాఫ్రికాపై అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్ విరాట్ కోహ్లీయే.