భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 18 (రేపటి) నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు నగరానికి చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడారు. ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో అవకాశం కల్పిస్తామని, తన పుట్టిన గడ్డపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న మహమ్మద్ సిరాజ్ రాణించాలని కోరుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు.
'సొంత గడ్డపై ఆడుతున్న సిరాజ్‌కు బెస్ట్ ఆఫ్ లక్.. మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్‌కు ఛాన్స్' - క్రికెట్
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జనవరి 18న భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కివీస్ సారథి టామ్ లాథమ్ మాట్లాడారు.
'న్యూజిలాండ్ బలమైన జట్టుతో రాబోయే సిరీస్ ఆడుతున్నాం. మా శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి ఇది మంచి అవకాశం. గత సిరీస్‌లో (శ్రీలంక) తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఇషాన్ కిషన్‌కు ఈ సారి మిడిల్ ఆర్డర్‌లో అవకాశం కల్పిస్తాం. సిరాజ్ బాగా ఆడుతున్నాడు. కొత్త బంతితో వికెట్లు తీస్తున్నాడు. తొలిసారి హోమ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్‌కు ఆల్ ది బెస్ట్. మూడు ఫార్మాట్లలో మాకు అతడు ముఖ్యమైన ప్లేయర్. వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని అతడి వర్క్‌లోడ్ మేనేజ్ చేస్తాం. అలాగే ప్రత్యర్థి జట్టు ఎలా ఉందో అని ఎక్కువగా ఆలోచించకుండా మా శక్తి సామర్థ్యాలపై దృష్టిపెడతాం' అని రోహిత్ శర్మ చెప్పాడు.
కలిసే ఆడాం.. ఎవరేంటో తెలుసు!
'ఈసారి వన్డే ప్రపంచకప్ భారత్‌లోనే జరగబోతోంది. కాబట్టి ఈ సిరీస్ మాకు చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాం. విలియమ్సన్, టిమ్ సౌథీ అందుబాటులో లేకపోవడంతో.. యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. ఇది కూడా మంచి పరిణామం. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచాం. అక్కడ కూడా భారత్‌లో మాదిరిగానే వాతావరణ పరిస్థితులుంటాయి. అది మాకు కలిసొచ్చింది. ఇండియాలో పిచ్‌లు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటాయి. పిచ్‌కు తగ్గట్టుగా రాణించే జట్టు మాతో ఉంది. ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లు, మేం కలిసే ఆడాం. కాబట్టి.. ఎవరి ఆటతీరు ఏంటో మాకు బాగా తెలుసు' అని టామ్ లాథమ్ అన్నాడు.