ఇంగ్లాండ్‌లో నిలకడగా బ్యాటింగ్ చేసేందుకు తన టెక్నిక్‌లో మార్పులు చేసుకున్నానని రోహిత్ శర్మ అన్నాడు. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు క్రీజులోంచి ఎక్కువగా కదలడం లేదని పేర్కొన్నాడు. బంతిని దేహానికి దగ్గర ఆడుతున్నానని వెల్లడించాడు. తాను ఔటైన తర్వాత మిడిలార్డర్ కుప్పకూలడంపై ఆందోళనేమీ చెందడం లేదన్నాడు.
"అవును, నా బ్యాటింగ్‌లో కొన్ని మార్పులు చేసుకున్నా. ఎందుకంటే బంతి విపరీతంగా స్వింగ్ అవుతున్నప్పుడు కొన్ని మార్పులు అనివార్యం. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఆడటం సులభం కాదు. అందుకే ఒక బ్యాట్స్‌మన్‌గా ఆ సవాళ్లను ఎదుర్కొనేందుకే మార్పులు చేసుకున్నా. క్రీజులో ఎక్కువగా కదలడం లేదు. బంతిని దేహానికి సమీపంగా ఆడుతున్నా" అని రోహిత్ అన్నాడు.
"మార్పులు నా ఆటకు విలువను జోడిస్తాయి. కొత్త బంతిని ఆడిన విధానం పట్ల సంతృప్తిగా ఉన్నా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులో నిలదొక్కుకోవడం అనేది ఉండదు. ప్రతి బంతిని కొత్త బంతిలాగే భావించాలి. పదేపదే దానిని గుర్తుచేసుకోవాలి" అని హిట్‌మ్యాన్ వెల్లడించాడు. 36 పరుగుల వద్ద తన ట్రేడ్‌మార్క్ ఫుల్ షాట్ ఆడి అతడు ఔటయ్యాడు.
"అది నాకిష్టమైన షాట్. అలాంటివి తప్పక ఆడాలి. నిజానికి మాకు ఎలాంటి చెత్త బంతులు రాలేదు. ప్రత్యర్థి బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. అందుకే అవకాశం దొరికినప్పుడు అలాంటి షాట్లు ఆడాల్సిందే. మన జోన్లో బంతి పడితే కచ్చితంగా శిక్షించాల్సిందే. రాహుల్, నేనూ అదే చేశాం" అని రోహిత్ తెలిపాడు. వెంటవెంటనే వికెట్లు పడటంపై ఆందోళన లేదని అతడు వెల్లడించాడు. మంచి బంతులకే వారు ఔటయ్యారని సమర్థించాడు.
ఇదీ చూడండి:-ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు లేదో తెలుసా?