వన్డే, టీ20లకు టీమ్ఇండియా కెప్టెన్‌గా అదరగొడుతున్న రోహిత్ శర్మ.. ఇకపై టెస్టులకు పూర్తిస్థాయిలో సారథిగా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఇటీవల టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకొన్న నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకతో త్వరలో ప్రారంభమయ్యే సిరీస్‌తో రోహిత్ టెస్టు బాధ్యతలు అందుకోనున్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. స్టార్ బౌలర్ బూమ్రాకు టెస్టు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ.
టెస్టు స్పెషలిస్టులపై వేటు..
గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న అజింక్య రహానె, పుజారాలను టెస్టు జట్టు నుంచి తప్పించారు. రంజీ మ్యాచ్‌లతో తిరిగి ఫామ్‌లోకి రావాలని ఆటగాళ్లకు సూచించామని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ వెల్లడించారు. వీరితో పాటు కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్లకు విశ్రాంతి ఇచ్చింది. వీరు శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉంటారని బోర్డు స్పష్టం చేసింది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బూమ్రాలు భవిష్యత్తులో జట్టుకు నాయకత్వం వహించేలా తీర్చిదిద్దుతామని బీసీసీఐ పేర్కొంది.
శ్రీలంకతో సిరీస్‌లకు భారత జట్టు ఇదే..
టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమా విహారి, శుభమన్ గిల్, రిషబ్ పంత్, కేఎల్ భరత్, ఆర్ అశ్విన్, జడేజా, జయంత్ ఠాకుర్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, షమి, సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ కుమార్.
టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్) , రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హూడా, బూమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, సంజు శాంసన్, చాహల్, జడేజా, కుల్దీప్ యాదవ్, రవి భిష్ణోయ్, ఆవేశ్ ఖాన్