Rohit Sharma News: టీమ్‌ఇండియా కెప్టెన్ ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మ మంచి జోష్ మీదున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి కెప్టెన్‌గా మంచి ఆరంభం అందుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టు వైస్ కెప్టెన్‌గాను ఎంపికయ్యాడు. ఈ సంతోషకరమైన సందర్భంలో హిట్‌మ్యాన్ తన భార్య రితికా పేరిట భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని దక్షిణ అలీబాగ్‌లో రూ.9 కోట్లతో నాలుగు ఎకరాలను కొనుగోలు చేశాడట. దీనికి సంబంధించిన ఈ నెల 14న రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ కొనుగోలు చేసిన భూమి.. అలీబాగ్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరళ్ మహాత్రోలి అనే గ్రామంలో ఉంటుంది.
Rohit Sharma Updates:
"భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం రోహిత్ శర్మ మా కార్యాలయానికి వచ్చిన మాట వాస్తవమే. కానీ, అతడు భూమిని కొన్నాడా లేదా అతడితో పాటు ఉన్న వ్యక్తి కొనుగోలు చేశాడా అన్నది మాకు తెలియదు" అలీబాగ్ సబ్ రిజిస్టర్ సంజాన జాదవ్ పేర్కొన్నారు. అదే విధంగా ఆ గ్రామ సర్పంచ్ అమిత్ నాయక్ మాట్లాడూతూ.. "రోహిత్ శర్మ తన భార్య పేరిట 4ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. దాని విలువ సూమారు రూ.9 కోట్లు ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఆ తరువాత మా గ్రామానికి వచ్చి ఆ స్ధలంలో పూజ కూడా నిర్వహించారు" అని పేర్కొన్నాడు.