ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్లేయర్స్ అందరూ తమ క్యాంపులకు చేరుకుని ప్రాక్టీస్ చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ లీగ్‌లో ఆడే ముంబయి ఇండియన్స్ టీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఐదు సార్లు ట్రోఫీని ముద్దాడిన ఈ టీమ్.. ఈ సారి కూడా ఎలాగైనా కప్పు కొట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇక ఈ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ సారి కూడా తమ జట్టుకు ట్రోఫీని అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ గురించి మాట్లాడాడు టీమ్ఇండియా మాజీ ప్లేయప్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ప్రజ్ఞాన్ ఓజా. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రోహిత్ శర్మ.. టీమ్ఇండియా కెప్టెన్‌గా ఎదిగిన ప్రయాణంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే తాను ఎదుర్కొన్న కష్టాలను గురించి తెలిపాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా మారేందుకు హిట్‌మ్యాన్ తీవ్రంగా శ్రమించాడని గుర్తుచేసుకున్నాడు. కొత్త కిట్‌ను కొనుగోలు చేసుకునేందుకు రోహిత్.. పాల ప్యాకెట్లను కూడా వేసినట్లు తెలిపాడు.
"నేను తొలిసారి అండర్-15 నేషనల్ క్యాంప్‌లో రోహిత్ శర్మను కలిశాను. అతడో స్పెషల్ ప్లేయర్ అని అందరూ నాతో చెప్పేవారు. అతడికి ప్రత్యర్థిగా ఆడి ఔట్ చేశాను. అయితే.. ఆడేటప్పుడు దూకుడుగా ఉండే రోహిత్ శర్మ పెద్దగా మాట్లాడేవాడు కాదు. నాతో ఆడేటప్పుడు మాత్రం చాలా దూకుడుగా వ్యవహరించేవాడు. ఎందుకు అలా ఉన్నాడో నాకైతే తెలియదు. ఆ తర్వాత కొన్నాళ్లకు మా మధ్య స్నేహం బలపడింది. అతడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఓ సారి మేము క్రికెట్ కిట్ బడ్జెట్ గురించి చర్చలు చేస్తుంటే ఒక్కసారిగా అతడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. దాని కోసం అతడు పాల ప్యాకెట్ల కూడా వేశాడు. ఇదంతా జరిగి చాలా కాలమైపోయింది. అసలు మా క్రికెట్ జర్నీ ఎలా మొదలైంది.. ఇప్పుడు హిట్‌మ్యాన్ ఎదిగిన తీరును చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది" అని ఓజా పేర్కొన్నాడు.