వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ(kohli captain) తప్పుకోనున్నాడా? రోహిత్ శర్మ ఈ పగ్గాలను అందుకోనున్నాడా? కొంతకాలంగా వినిపిస్తున్న వాదనలివి. ఇప్పటికే ఎంతో మంది అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు ద్వంద్వ కెప్టెన్సీని అమలు చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడీ ఊహాగానాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అక్టోబర్‌లో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్(టెస్ట్), హిట్‌మ్యాన్(వన్డే, టీ20) సారథ్య బాధ్యతలు పంచుకుంటారని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా స్పష్టం చేశాయి.
కొద్ది నెలలుగా(ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఎక్కువగా) ఇదే విషయమై విరాట్, రోహిత్, టీమ్ మెనేజ్మెంట్ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపాయి. త్వరలోనే కోహ్లీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటిస్తాడని వెల్లడించాయి.
"కోహ్లీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటిస్తాడు. అతడు మునపటిలా ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఫామ్‌లో రావడానికి తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టనున్నాడు" అని బోర్డు వర్గాలు తెలిపాయి.