భారత యువ క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్యానికి సంబంధించి ఓ శుభవార్త వచ్చింది. రిషబ్ పంత్ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగు పడినట్లుగా వైద్యులు తెలిపారు. అతడిని ఐసీయు నుంచి ప్రత్యేకంగా కేటాయించిన గదికి మార్చినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఇన్ఫెక్షన్లు వస్తాయేమోనన్న ఆందోళనతో అతడిని ప్రత్యేక గదికి మార్చినట్లు తెలిపారు. ప్రస్తుతం దెహ్రాదూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో పంత్ చికిత్స పొందుతున్నాడు. కాగా, పంత్ కాలికి లిగ్మెంట్ చికిత్స ఎక్కడ చేయించాలనేది బీసీసీఐ నిర్ణయం తీసుకొనుందని సమాచారం.
సీఎం పరామర్శ:
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం పంత్‌ను పరామర్శించారు. పంత్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంత్ కుటుంబ సభ్యులనూ కలిశారు. సుమారు గంటపాటు పంత్ తల్లి సరోజ్ పంత్, సోదరి సాక్షి పంత్‌తో మాట్లాడారు. పంత్ ఆరోగ్యం పట్ల ఆందోళన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు.