Rishabh Pant Pujara: 2020-2021 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో సీనియర్ బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారా తనకు 97 పరుగుల గురించి గుర్తు చేయకపోయి ఉంటే ఆరోజు సెంచరీ చేసేవాడినని యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ పేర్కొన్నాడు. 407 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా ఒక దశలో మ్యాచ్ గెలిచేలా కనిపించింది. అయితే, పంత్ శతకానికి మూడు పరుగుల దూరంలో ఔటయ్యాక పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. చివరికి హనుమ విహారి (23; 161 బంతుల్లో 4x4), అశ్విన్ (39; 128 బంతుల్లో 7x4) నాటౌట్‌గా నిలిచి టీమ్‌ఇండియాకు ఓటమి తప్పించారు.
తాజాగా ఆ చారిత్రక టెస్టు సిరీస్‌కు సంబంధించిన డాక్యుమెంటరీ వెబ్‌సిరీస్‌లో పంత్ మాట్లాడుతూ.. ఆ రోజు పుజారా ఏమన్నాడో గుర్తు చేసుకున్నాడు. "నేను 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా.. అతడు నా వద్దకు వచ్చి 'కాస్త నెమ్మదిగా ఆడు. నువ్వు బౌండరీలు కొట్టాల్సిన అవసరం లేదు. నిదానంగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఇన్నింగ్స్ కొనసాగించొచ్చు' అని చెప్పాడు. దాంతో నాకు కోపం వచ్చి కాస్త గందరగోళానికి గురయ్యా. నా ప్రణాళిక పరంగా ఆడటమే నాకిష్టం. అప్పటికే మేం మంచి భాగస్వామ్యం నిర్మించాం. క్రీజులో పాతుకుపోయాం. పుజారా అలా చెప్పేసరికి ఏం అర్థంకాలేదు. ఒకవేళ నేను ఆరోజు శతకం చేసి ఉంటే.. అది నా కెరీర్‌లో గొప్ప ఇన్నింగ్స్ అయ్యేది" అని పంత్ చెప్పుకొచ్చాడు.