Rinku Singh Syed Mushtaq Ali Trophy : 2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా పంజాబ్ - ఉత్తర్‌ప్రదేశ్ జట్లు గురువారం తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్ నిర్దేశించిన 170 పరుగుల టార్గెట్‌ను పంజాబ్.. 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. బ్యాటర్లు నెహాల్ వధేరా (52 పరుగులు), అన్మోల్ప్రీత్ సింగ్ (43), సన్వీర్ సింగ్ (35), రమణ్‌దీప్ సింగ్ (22) రాణించారు. అయితే ఈ పోరులో ఉత్తర్‌ప్రదేశ్ ఓడినప్పటికీ.. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఆట మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
పంజాబ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు యూపీ బ్యాటర్లు తెగ కష్టపడ్డారు. కానీ, మిడిలార్డర్లో వచ్చిన రింకూ సింగ్.. బీభత్సం సృష్టించాడు. అతడు అలవోకగా పంజాబ్ బౌలర్లను ఎదుర్కొంటూ.. బౌండరీలు సాధించాడు. ఈ క్రమంలోనే కేవలం 33 బంతుల్లో.. 233 స్ట్రైక్ రేట్‌తో 77 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. మరి అంతటి భీకరమైన ఇన్నింగ్స్ మీరు చూశారా.
మరోవైపు సమీర్ రిజ్వీ (42 పరుగులు: 29 బంతుల్లో, 1x4, 4x6) కూడా అలవోకగా పరుగులు సాధించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 116 పరుగులు జోడించి.. తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పంజాబ్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు.