ఆసియా కప్ సూపర్-4లో భారత్, పాక్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. కానీ విజయం చివరికి ప్రత్యర్థి జట్టుపై నిలిచింది. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలను తెలుసుకుందాం..
పవర్‌ప్లేలో.. పాక్‌తో పోలిస్తే భారత్ పవర్‌ప్లేను అద్భుతంగా వాడుకుంది. సగటున 10.33 రన్‌రేట్‌తో 62 పరుగులు చేసి కేవలం ఒక్క వికెట్‌నే కోల్పోయింది. దీంతో భారత్ స్కోర్ 200 పరుగులు దాటడం ఖాయమని అంచనా వేశారు. 7-15 ఓవర్ల మధ్యలో మాత్రం భారత్ రన్‌రేట్ టీ20 స్థాయిలో లేదు. ఈ సమయంలో మొత్తం 4 విలువైన వికెట్లు కోల్పోయి కేవలం 73 పరుగులే చేసింది. పవర్ ప్లేలో భారత్ మూడు ఓవర్లలో పదికిపైగా పరుగులు సాధిస్తే.. మిగిలిన 15 ఓవర్లో కేవలం 3 సార్లు మాత్రమే ఓవర్‌కు పదికి పైగా పరుగులు సాధించింది. పాక్ తరఫున షాదాబ్‌ఖాన్(7.75 ఎకానమీ), మహమ్మద్ నవాజ్(6.25 ఎకానమీ) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
అదే పాకిస్థాన్ పవర్ ప్లేలో ఒక్క ఓవర్లో కూడా 10 పరుగులను సాధించలేదు. ఆ సమయంలో పాక్ రన్‌రేట్ 7.33 మాత్రమే. పైగా బాబర్ వంటి స్టార్ ఆటగాడి వికెట్ కోల్పోయింది. కానీ, 7-20 ఓవర్లలో ఏడు సార్లు ఓవర్‌కు పది అంతకు మించి పరుగులు సాధించింది. ముఖ్యంగా 9-15 ఓవర్ల మధ్యలో ప్రతి ఓవర్‌లో కనీసం ఓ భారీ షాట్ ఉంది. దీనికి తోడు పాక్ బ్యాట్స్‌మెన్ వేగంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. సింగిల్స్, డబుల్స్ సాధించారు. ఇదే మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకొంది. 7-15 ఓవర్ల మధ్య ఫకర్ జమాన్ రూపంలో ఒకే ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయింది.
నిలకడగా ఆడకుండా.. భారత్ మిడిల్ ఆర్డర్ కుదురుకోకపోవడం ఈ మ్యాచ్‌లో పెద్ద లోపం. ఓ పక్క కోహ్లీ నిలకడగా ఆడుతున్నా.. అతడికి మద్దతు ఇచ్చే పటిష్ఠమైన భాగస్వామి దొరకలేదు. రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ వేగంగా వికెట్లు సమర్పించుకొన్నారు. ముఖ్యంగా పంత్ క్రీజులో ఉన్న సమయంలో రన్‌రేట్ తగ్గింది. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తి సింగిల్స్ రాబట్టే సమయంలో పంత్ నుంచి కోహ్లీకి పెద్దగా సహకారం రాలేదు. దీనికి తోడు కీలక సమయంలో పంత్ ఓ అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ను సమర్పించుకోవడం భారత్‌పై ఒత్తిడి పెంచింది.
మరోవైపు పాక్ ఆటగాళ్లు మ్యాచ్ ప్రణాళికను పక్కాగా అమలు చేశారు. బలమైన భాగస్వామ్యాలను నమోదు చేసుకొంటూ వెళ్లారు. కీపింగ్ చేస్తూ గాయపడిన మహమ్మద్ రిజ్వాన్.. బ్యాటింగ్ సమయంలో పాక్‌కు వెన్నెముకగా నిలిచాడు. బాబర్ అజామ్‌తో కలిసి (22పరుగులు), ఫకర్ జమాన్‌తో (41), మహమ్మద్ నవాజ్‌తో (73), షాతో (11) పరుగుల విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. భారత్ బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్-రాహుల్ కలిసి సాధించిన 54 పరుగులే ఇన్నింగ్స్ మొత్తంలో అతిపెద్ద భాగస్వామ్యం కావడం గమనార్హం.
ఒత్తిడికి చిత్తు..మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 15 ఓవర్లు ముగిసే సమయానికి ఇరు జట్లు సమంగా 135 పరుగులే చేశాయి. కాకపోతే పాక్ 2 వికెట్లు కోల్పోగా.. భారత్ 5 వికెట్లు కోల్పోయింది. అంటే మిగిలిన ఐదు ఓవర్లు ఆడటానికి పాక్ వద్ద బలమైన బ్యాటింగ్ లైనప్ చేతిలో ఉంది. అలాంటి సమయంలో భారత్ బౌలర్లు ఒత్తిడికిలోనై వైడ్ల రూపంలో అదనపు పరుగులు పాక్‌కు సమర్పించుకొన్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు 14 అదనపు పరుగులు ఇవ్వగా.. భారత్ బౌలర్లు 8 మాత్రమే ఇచ్చారు. ఈ అంకెను చూస్తే భారత్ బౌలింగ్ మెరుగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, పాక్ బౌలర్లు చివరి ఐదు ఓవర్లలో కేవలం 2 అదనపు పరుగులు మాత్రమే ఇచ్చారు. భారత్ బౌలర్లు మాత్రం చివరి ఐదు ఓవర్లలో లయను కోల్పోయి వైడ్ల రూపంలో ఆరు పరుగులను సమర్పించుకొన్నారు. అంటే పాక్‌కు అదనంగా ఒక ఓవర్ వేసినట్లే కదా..! దీనికి తోడు 17వ ఓవర్‌లో అర్ష్‌దీప్ కీలక క్యాచ్ వదిలేయడం కూడా భారత్‌పై ఉన్న ఒత్తిడిని చెబుతోంది.
ఇదీ చూడండి: అర్ష్‌దీప్ క్యాచ్ మిస్.. రోహిత్ సీరియస్.. వీడియో వైరల్