Rahul Dravid on Vihari: టీమ్ఇండియాలో సీనియర్లు ఉన్నంతకాలం హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్ అవకాశాలకోసం వేచిచూడాల్సి ఉంటుందని జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. అయితే.. అవకాశం దొరికిన ప్రతిసారి వారు మెరుగ్గా రాణించారని ప్రశంసించాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో విహారి కీలక ఇన్నింగ్స్ ఆడిన సందర్భాన్ని గుర్తుచేశాడు. శ్రేయస్ కూడా మిడిలార్డర్లో మెరుగైన బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడని అన్నాడు.
"హనుమ విహారి రెండో టెస్టులో బాగా ఆడాడు. ప్రత్యేకంగా రెండో ఇన్నింగ్స్‌లో చక్కటి ప్రదర్శన చేశాడు. ఇటీవలే టెస్టు అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్.. చక్కటి ఫామ్‌ను కనబరిచాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ జట్టులో పూర్తి స్థాయిలో అవకాశం లభించే సమయం వస్తుందని ఆశిస్తున్నా."
--రాహుల్ ద్రవిడ్, టీమ్ఇండియా హెడ్ కోచ్.
అయితే.. సీనియర్ ఆటగాళ్లు రహానే, పుజారా, కోహ్లీ స్థానంలో శ్రేయస్‌కు అవకాశం లభించదని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. విరాట్ మూడో టెస్టు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని స్పష్టం చేశాడు. కెరీర్ తొలినాళ్లలో కోహ్లీ, పుజారా, రహానే కూడా అవకాశాల కోసం ఎదురుచూసేవారని ద్రవిడ్ గుర్తుచేశాడు. అవకాశం వచ్చేవరకు ఓపికతో ఉండటం అనేది చాలా అవసరమని సూచించాడు.