Players Under Rohit Captaincy :ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ అనేక మంది ప్లేయర్లకు మంచి ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది. ప్రస్తుత టీమ్ఇండియాలో పలువురు కీలక ఆటగాళ్లు ఐపీఎల్లో ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. ఇక 10 సీజన్లపాటు జట్టును నడిపిన రోహిత్‌ను తప్పించి, ఆ బాధ్యతలు ఇటీవల హార్దిక్‌కు అప్పగించింది ఫ్రాంచైజీ యాజమాన్యం. అయితే హార్దిక్ సహా పలువురు ప్లేయర్లు, రోహిత్ శర్మ సారథ్యంలోనే ఐపీఎల్లో ముంబయి తరఫున అరంగేట్రం చేసి నేడు జాతీయ జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగారు.
- హార్దిక్ పాండ్య : హార్దిక్ పాండ్య 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆల్‌రౌండర్‌గా ముంబయికి అనేక విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు హార్దిక్. రోహిత్ కెప్టెన్సీలో ముంబయిలో అదరగొట్టిన హార్దిక్‌కు 2016లో టీమ్ఇండియా పిలుపు అందింది. అలా ఇంటర్నేషనల్ లెవెల్లోనూ అదరగొట్టి, ప్రస్తుతం టీమ్ఇండియా టీ20 కెప్టెన్ దాకా ఎదిగాడు హార్దిక్ పాండ్య.
- జస్ప్రీత్ బుమ్రా :జస్ర్పీత్ బుమ్రా 2013లో ఐపీఎల్లో ముంబయితోనే ఎంట్రీ ఇచ్చాడు. తొలినాళ్లలో బుమ్రా బౌలింగ్ యాక్షన్ చూసి, చాలా మంది కామెంట్ చేశారు. దీంతోపాటు ఐపీఎల్లో తొలి మూడు సీజన్లలో బుమ్రా పెద్దగా రాణించలేదు. ఇక 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బుమ్రా, ఈ ఏడాది ఐర్లాండ్ పర్యటనలో టీమ్ఇండియాకు సారధ్యం వహించాడు.
- సూర్యకుమార్ యాదవ్ : 2012లో ఐపీఎల్లో ముంబయితోనే అరంగేట్రం చేసిన సూర్య కొంతకాలానికే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ట్రేడయ్యాడు. ఆ జట్టులో సూర్యకు పెద్దగా పేరురాలేదు. ఇక 2018లో తిరిగి మళ్లీ ముంబయిలోకి వచ్చిన తర్వాతే సూర్య టాప్ ప్లేయర్‌గా ఎదిగాడు. 2021లో టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేసి ఏడాదిలోనే టీ20 ర్యాంకింగ్స్‌లో నెం.1 అయ్యాడు. దీంతో తాజాగా సౌతాఫ్రికా పర్యటనలో టీ20 కెప్టెన్‌గా అవకాశం దక్కింది.
- ఇషాన్ కిషన్ : 2016లో గుజరాత్ లయన్స్ జట్టుతో ఐపీఎల్లో పరిచయం అయ్యాడు ఇషాన్ కిషన్. ఇక 2018 సీజన్లో ముంబయి ఇషాన్‌ను కొలుగోలు చేసింది. ఐపీఎల్లో సత్తా చాటడం వల్ల ఇషాన్‌కు టీమ్ఇండియా పిలుపు అందింది. ప్రస్తుతం 25 ఏళ్ల ఇషాన్ జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదుగుతున్నాడు.
- తిలక్ వర్మ : 21 ఏళ్ల తిలక్ వర్మను ముంబయి ఫ్రాంచైజీ 2022 వేలంలో దక్కించుకుంది. ముంబయి తరఫున రెండు సీజన్లు ఆడిన తిలక్, రోహిత్ ప్రోత్సాహంతో అతి తక్కువ రోజుల్లోనే టీమ్ఇండియలోకి వచ్చాడనడంలో సందేహం లేదు. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్, ఆసియా గేమ్స్, పలు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తిలక్ ఎంపికయ్యి రాణించాడు.