సాధారణంగా ఏ క్రికెట్ మ్యాచ్‌లోనైనా ఐదు లేదా ఆరుగురు బౌలర్లు బౌలింగ్ చేస్తారు. అప్పుడప్పుడు ఏడుగురు బౌలర్లు బంతిని విసిరిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఓ మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది మంది బౌలింగ్ చేసి రికార్డుకెక్కారు. ఈ అరుదైన సంఘటన గురువారం మహిళల ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో చోటు చేసుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ తొమ్మిది మందితో బౌలింగ్ చేయించింది. వికెట్ కీపర్ బెత్ మూనీ, కెప్టెన్ మెగ్ లానింగ్ మినహా మిగతా జట్టు సభ్యులందరూ బౌలింగ్ చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది మంది బౌలింగ్ చేయడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. పాక్ నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 12.4 ఓవర్లలోనే ఛేదించింది.