Shaheen Afridi 4 Wickets : పాకిస్థాన్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో రెచ్చిపోయాడు. ఇంగ్లాండ్‌లో జూన్ 30న జరిగిన టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్లో నాటింగ్‌హామ్‌షైర్ జట్టు తరఫున ఆడుతున్న అతడు తొలి ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి శభాష్ అనిపించుకున్నాడు. వార్విక్షైర్ బేర్స్ టీమ్ తరఫున క్రీజ్‌లోకి వచ్చిన ఇద్దరు ఆటగాళ్లను తాను వేసిన మొదటి ఓవర్లోని తొలి రెండు బంతుల్లోనే ఔట్ చేసి పెవిలియన్ పంపాడు. ఆపై బరిలోకి దిగిన మరో ఇద్దరు ప్లేయర్స్‌కు చెరో రన్ ఇచ్చి వారిని కూడా పెవిలియన్ బాట పట్టించాడు. అఫ్రిది బౌలింగ్ ధాటికి వార్విక్షైర్ టీమ్.. తొలి ఓవర్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ బౌలర్ తొలి ఓవర్‌లోనే 4 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి. దీంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా అఫ్రిది రికార్డులోకెక్కాడు.
ఆరులో నాలుగు..
షహీన్ అఫ్రిది తొలి బంతి వైడ్ బాల్‌గా వేయగా.. కీపర్ బాల్‌ను పట్టలేకపోవడం వల్ల అది బౌండరీకి వెళ్లింది. దాంతో ఆ జట్టుకు 5 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి అలెక్స్ డేవిస్ (0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రెండో బంతికి బెంజమిన్ (0) బౌల్డ్ అయ్యాడు. 3, 4 బంతుల్లో సింగల్స్ తీశారు. ఇక ఐదో బాల్‌కు మౌస్లే (1) క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరగా ఆరో బంతికి బర్నార్డ్ (0) క్లీన్ బౌల్డయ్యాడు. వీటితో అఫ్రిది వేసిన తొలి ఓవర్‌లో మొత్తం 4 వికెట్లు వచ్చాయి. షహీన్ చారిత్రత్మక ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఫ్రిది దూకుడును చూసిన నెటిజన్లు అతడిని తెగ మెచ్చుకుంటున్నారు.