PAK VS SA World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ టీం చేతులెత్తేసింది. శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓటమి పాలైంది. భారత్ చేతిలో పరాజయాన్ని అందుకున్న తర్వాత పాకిస్థాన్ మళ్లీ గెలుపు రుచే చూడలేకపోయింది. గత మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ చేతిలో కంగుతిన్న పాక్.. ఇప్పుడు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గొప్పగా పోరాడినా చివరికి ఓటమి వైపే నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలోనే ఆ జట్టు తొలిసారి వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది. దీంతో సెమీస్ రేసులో నిలిచే అవకాశాన్ని మరింత సంక్లిష్టం చేసుకుంది పాక్. ఒక్క వికెట్ తేడాతో సౌతాఫ్రికా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది దక్షిణాఫ్రికా.
మొదట టాస్ గెలిచి బ్యాంటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. 271 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు టెంబా బవుమా (28), క్వింటన్ డికాక్ (24), రసీ వాన్ డెర్ డసన్ (21) మంచి ఆరంభాలను వృథా చేసుకుంటూ ఔట్ అయ్యారు. డికాక్ దూకుడుగా ఆడి షహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో మహ్మద్ వాసిమ్‌కు చిక్కాడు. బవుమాను వాసిమ్ ఔట్ చేశాడు. రసీ వాన్ డెర్ డసన్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందిగానే ఆడాడు. ఆఖరికి ఉస్మాన్ మిర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
అయిడెన్ మార్‌క్రమ్ సెంచరీ..దక్షిణాఫ్రికా గెలుపులో కీలక పాత్ర పోషించాడు ఎయిడెన్ మార్‌క్రమ్(91; 93 బంతుల్లో 7×4, 3×6). తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ 91 పరుగులు సాధించాడు. అయితే చివర్లో విజయం దోబూచులాడింది. విజయానికి 20కి పైగా పరుగులు కావాల్సిన దశలో దక్షిణాఫ్రికా జట్టు ప్రధాన బ్యాటర్లంతా పెవీలియన్‌కు చేరారు. అలా దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల పాక్ పుంజుకున్నట్లైంది. ఓ దశలో విజయం పాక్ చేతిలోకి వెళ్లిపోయినట్టే కనిపించింది.