ODI World Cup 2023 Shubman Gill Vs Afghanistan : టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ లేని లోటు.. ప్రపంచ కప్ 2023 తొలి మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్.. కీలకమైన లక్ష్య ఛేదనలో విఫలమయ్యాడు. అతడితో పాటు రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ కూడా డకౌట్ కావడం వల్ల టీమ్ మొదట్లోనే కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఈ ఏడాది పుల్ ఫామ్‌లో ఉన్న గిల్.. డెంగ్యూ కారణంగా ఈ తొలి మ్యాచ్ ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. మరి గిల్ ఇప్పుడు అప్ఘానిస్థాన్‌తో జరగబోయే రెండో మ్యాచ్‌లో అయినా ఆడతాడా అంటే అనుమానం అందరిలో నెలకొంది. అయితే తాజాగా దీనిపై బీసీసీఐ నుంచి క్లారిటీ వచ్చింది.
నేడు అక్టోబర్ 9న టీమ్ ఇండియా.. తమ రెండో మ్యాచ్ జరగనున్న దిల్లీకి బయలుదేరింది. అయితే దిల్లీకి బయలు దేరిన జట్టులో గిల్ లేడు. అతడు ఇంకా కోలుకోలేదని బీసీసీఐ తెలిపింది. 11వ తేదీన జరగనున్న రెండో ప్రపంచ కప్ మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడు అని స్పష్టం చేసింది. ప్రస్తుతం అతడు చెన్నైలోనే ఉన్నాడని, బీసీసీఐ వైద్య అధికారుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇకపోతే ఆఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత భారత్... పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌కు అయినా గిల్ అందుబాటులోకి వస్తాడో లేదో చూడాలి.