ODI World Cup 2023 : న్యూజిలాండ్ జట్టులో రప్ఫాడిస్తున్న మనోడు.. ఎవరీ 23 ఏళ్ల రచిన్ రవీంద్ర?.. అనంతపురంతో లింక్! - వన్డే వరల్డ్ కప్ 2023 రచిన్ రవీంద్ర
ODI World Cup 2023 Rachin Ravindra : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర విజృంభిస్తున్నాడు. అతడు భారత సంతతి ప్లేయర్ కావడం విశేషం. ఇంతకీ అతడు ఎవరంటే?
Published : Oct 5, 2023, 7:44 PM IST
ODI World Cup 2023 Rachin Ravindra : ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ప్రపంచకప్ ఫైనలిస్టులు అయిన ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు చెందిన భారత సంతతి ప్లేయర్ రచిన్ విజృంభిస్తున్నాడు. ఓపెనింగ్ సెర్మనీ లేక చప్పగా ప్రారంభమైన ఈ టోర్నీలో అతడు తన దూకుడైన ఇన్నింగ్స్‌తో అభిమానులకు మంచి మజాను అందిస్తున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతడు క్రికెట్ ఫ్యాన్స్ అస్సలు ఊహించని రేంజ్లో ఆడుతున్నాడు. ఇప్పటికే హాప్ సెంచరీ బాదేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
- ఇంతకీ ఇతడు ఎవరంటే?.. ఇంతకీ ఇతడు ఎవరంటే?.. భారత సంతతి ప్లేయర్ అయిన రచిన్ రవీంద్ర... టీమ్ఇండియాపై 2021లో టెస్టు ఆరంగ్రేటం చేశాడు. ఆ తర్వాత 2023లో వన్డే డిబట్ చేశాడు. ఇప్పటి వరకు అతడు 12 వన్డేలు, 20 టీ20లు, 3 టెస్టులు ఆడాడు.
- వాస్తవానికి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్ మ్యాచ్‌లోనే రచిన్ రవీంద్రకు చోటు దక్కింది. కానీ తుది జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు.
- 23 ఏళ్ల రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతీయులే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు.
- అయితే రచిన్ పుట్టి పెరిగింది అక్కడే అయినా.. అతడు క్రికెట్‌లో రాటుతేలింది మాత్రం ఇక్కడేనట. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న స్పోర్ట్స్ ఫౌండేషన్‌కు వచ్చి అతడు క్రికెట్ ఆడతుండేవాడట.
- తన తండ్రి రవి కృష్ణమూర్తి స్థాపించిన హాట్ హాక్స్ క్లబ్ తరుపున రచిన్ రవీంద్రతో పాటు చాలామంది ప్లేయర్లు, న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి క్రికెట్ టోర్నీలు ఆడేవారట.
- రచిన్ రవీంద్ర తండ్రి ఫెవరెట్ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్. అందుకే రాహుల్ ద్రవిడ్ పేరు నుంచి 'రా'.. సచిన్ పేరు నుంచి 'చిన్' తీసుకుని రచిన్ అనే పేరు తన కొడుకుకు పెట్టారు.