ODI World Cup 2023 Pak VS Srilanka :వరల్డ్ కప్ - 2023లో పాకిస్థాన్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 345 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. మరో 10 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ మరోసారి నిరాశపరిచినా.. మహ్మద్ రిజ్వాన్ అజేయ సెంచరీతో మ్యాచ్‌ను ముగించాడు.
ఇంకా ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ ( 103 బంతుల్లో 113; 10×4,3×6), మహ్మద్ రిజ్వాన్ ( 121 బంతుల్లో 134; 9×4, 3×6) సెంచరీలతో చెలరేగారు. దీంతో విజయం పాక్ సొంతమైంది. శ్రీలంక బౌలర్లలో మదుశనక 2 వికెట్లు తీయగా, తీక్షణ, పతిరణ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (77 బంతుల్లో 122; 14×4, 6×6), సమరవిక్రమ ( 89 బంతుల్లో 108; 11×4,2×6) సెంచరీలు బాదగా, నిశాంక (61 బంతుల్లో 51; 7×4,1×6) హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ 4 వికెట్లు తీయగా.. హరీస్ రాఫ్ 2, షహీన్ అఫ్రిది, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.