Nishanth Saranu Pakistan Netbowler : భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకాలు మొదలైపోయాయి. అక్టోబర్ 5న అట్టహాసంగా మొదలవ్వనున్న ఈ పోరులో పాల్గొనేందుకు వివిధ దేశాల ప్లేయర్లు ఇండియాకు వస్తున్నారు. ఇప్పటికే అఫ్గానిస్థాన్ టీమ్ రాగా.. తాజాగా పాకిస్థాన్ జట్టు కూడా హైదరాబాద్‌కు చేరుకుంది. ఇక వరల్డ్ కప్‌నకు ముందు ఆడే ప్రాక్టీసులు ఆరంభమవ్వనున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 29న పాకిస్థాన్ తన తొలి వార్మప్ మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడనుంది. అయితే దీని కోసం పాక్ సేన ఇప్పటికే కసరత్తులు ప్రారంభించగా.. వారి నెట్ ప్రాక్టీస్‌లో ఆరడుగులున్న ఓ వ్యక్తిపై అందరి దృష్టి పడింది. ఆ వ్యక్తి మైదానంలో బంతులను సంధిస్తుంటే అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. అతనెవరా అంటూ నెట్టింట తెగ వెతికేశారు. అయితే అతనెవరో కాదు హైదరాబాద్‌కు చెందిన అండర్-19 పేసర్ నిశాంత్ సరను.
అండర్ 19 క్రికెట్ జట్టులో ఉన్న నిశాంత్... ప్రస్తుతం పాకిస్థాన్ జట్టుకు అందుబాటులో ఉన్న అనేక మంది నెట్ బౌలర్లలో ఒకడు. హారిస్ రౌఫ్, షాహీన్ షా అఫ్రిది లాంటి మేటి స్పిన్నర్లు ఉన్న పాక్ జట్టుకు.. ప్రాక్టీస్ సమయంలో అందుబాటులో ఉండేందుకు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్.. నిశాంత్‌ను ఎంపిక చేశారు. గురువారం జరిగిన నెట్ సెషన్లో బౌలింగ్ చేసిన నిశాంత్ తన స్టైల్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.