Tim Southee Suryakumar Yadav : టీ20 ఫార్మాట్‌లో విభిన్న షాట్లతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ కూడా అభినందనలు చెబుతూనే కీలక వ్యాఖ్యలు చేశాడు. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ సెంచరీ సాధించగా.. సౌథీ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ క్రమంలో భారత్ నుంచి వచ్చిన టీ20 బ్యాటర్లలో సూర్యకుమారే అత్యుత్తమ బ్యాటరా? అనే వ్యాఖ్యలపై సౌథీ స్పందించాడు.
టీమ్ఇండియాలో 'సూర్య' అత్యుత్తమ ఆటగాడేమీ కాదు: కివీస్ బౌలర్ - న్యూజిలాండ్ భారత్ టీ 20 సిరీస్
Tim Southee Suryakumar Yadav : ప్రస్తుత తరుణంలో టీమ్‌ఇండియా తరఫున టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ ఒకడు. అయితే టిమ్ సౌథీ మాత్రం సూర్యపై మరోలా స్పందించాడు. సౌథీ ఏమన్నాడంటే?
"టీమ్‌ఇండియా నుంచి చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లు వచ్చారు. కేవలం టీ20 మాత్రమే కాకుండా మూడు ఫార్మాట్లలోనూ మంచి బ్యాటర్లు ఉన్నారు. అయితే సూర్యకుమార్ గత 12 నెలలుగా అద్భుతంగా ఆడుతున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. మైదానం నలువైపులా షాట్లు కొట్టగల సమర్థుడు. భారత టీ20 లీగ్‌తోపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొట్టేస్తున్నాడు. ఇక రెండో మ్యాచ్‌లో ఆడిన విధానం అద్భుతం. ఉత్తమ బ్యాటర్‌గా నిలవాలంటే తన ఫామ్‌ను ఇలానే కొనసాగించాల్సి ఉంటుంది" అని టిమ్ సౌథీ అన్నాడు.
నేను లక్కీ: సౌథీ
"చివరి ఓవర్ బౌలింగ్ వేయడం అదృష్టంగా భావిస్తున్నాను. హ్యాట్రిక్ తీయడం ఆనందంగా ఉంది. కొన్నిసార్లు ఉత్తమంగా బౌలింగ్ చేసినప్పటికీ ప్రశంసలు పొందలేము. కానీ రెండో మ్యాచ్‌లో పరిస్థితులు కాస్త విభిన్నం. చిత్తడి పరిస్థితుల్లో ఆడటం ఇరు జట్లకూ కష్టమే. పరిస్థితులను అర్థం చేసుకొని ఆడాల్సి ఉంటుంది." అని వెల్లడించాడు. మంగళవారం నేపియర్ వేదికగా భారత్‌తో జరిగే చివరి వన్డేలో కివీస్‌కు టిమ్ సౌథీ సారథ్యం వహించనున్నాడు. రెగ్యులర్ సారథి కేన్ విలియమ్సన్ మెడికల్ అపాయింట్‌మెంట్ కారణంగా ఆఖరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు.