చక్కటి స్వింగ్ బౌలింగ్‌తో గత రెండు, మూడేళ్లుగా మూడు ఫార్మాట్స్‌లోనూ మంచి ప్రతిభను చాటుకున్నాడు పేసర్ మహ్మద్ సిరాజ్. కానీ ఐపీఎల్ 2022 సీజన్ సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. మరోవైపు ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ వెలుగులోకి రావడంతో సిరాజ్‌ను పక్కనపెట్టారు సెలెక్టర్లు. జింబాబ్వే, ఐర్లాండ్‌తో పాటు పలు సిరీస్‌లకు అతడిని ఎంపిక చేయలేదు. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లకు కూడా సిరాజ్ పేరును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు.
తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు కొవిడ్ కారణంగా పేసర్ మహమ్మద్ షమీ దూరం కావడంతో అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను ఎంపికచేశారు. అయితే ఉమేశ్ యాదవ్ జాతీయ జట్టుకు ఆడి చాలా కాలమైంది. దాదాపు రెండేళ్ల క్రితం టీమ్ఇండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. అనూహ్యంగా అతడిని ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సిరాజ్‌ను కాదని ఉమేశ్‌కు స్థానం కల్పించడంపై నెటిజన్లు.. బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు. సిరాజ్‌ను కావాలనే పక్కనపెడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. షమీ స్థానంలో సిరాజ్ బెటర్ ఆప్షన్ అని సూచిస్తున్నారు. సిరాజ్ ఏం పాపం చేశాడంటూ ట్రోల్ చేస్తున్నారు.