పదహారేళ్ల వయసులో బ్యాట్ పట్టి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలీరాజ్.. 39 ఏళ్ల వయసులో తన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. 22 గజాల క్రికెట్ పిచ్‌పై..23 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు సెలవు ప్రకటించారు. అద్భుత ఆటతీరుతో వర్థమాన క్రికెటర్లకు దిశానిర్దేశం చేసి భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఓ రూపు తీసుకొచ్చిన మిథాలీ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్నిరకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. 23 ఏళ్ల పాటు భారత మహిళా క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన మిథాలీ.. ఈ సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని ట్విట్టర్ వేదికగా వీడ్కోలు లేఖ విడుదల చేశారు. ఎన్నో రికార్డులను తన పేర లిఖించిన ఈ క్రికెట్ దిగ్గజం భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఓ రూపునిచ్చారు..
భారత్‌లో మహిళా క్రికెట్‌ను తీర్చిదిద్దడంలో తన పాత్ర ఉన్నందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని మిథాలీ లేఖలో పేర్కొన్నారు. సుదీర్ఘకాలం భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నట్టు తెలిపారు. ఈ ప్రయాణంలో అడుగడుగునా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీసీసీఐ, కార్యదర్శి జై షాకు మిథాలీ ధన్యవాదాలు తెలిపారు. ఇండియా జెర్సీ వేసుకుని దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమన్న మిథాలీ.. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానని తెలిపారు. ఎంతోమంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు రావాలని భారత మహిళా క్రికెట్ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలని మిథాలీరాజ్ భావోద్వేగ లేఖను విడుదల చేశారు.
మహిళా క్రికెట్‌లో ఎన్నో రికార్డులు..:1999 జూన్ 26న అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశారు. 2022 మార్చి 27న మిథాలీ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 23 ఏళ్లపాటు బ్యాటుతో కనికట్టు చేసి క్రికెట్ ప్రేమికులను మంత్రుముగ్దులను చేశారు. సుదీర్ఘ కెరీర్‌లో 232 వన్డేలు ఆడి 7 వేల 805 పరుగులు చేసిన మిథాలీ.. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు లిఖించారు. మొత్తం 7,805 పరుగుల్లో ఏడు శతకాలు.. 64 అర్థ శతకాలు ఉన్నాయి. సుదీర్ఘ కెరీర్‌లో 12 టెస్టులు ఆడిన మిథాలీరాజ్.. ఒక ద్విశతకం సహా 4అర్థశతకాలతో 699 పరుగులు చేశారు. మహిళల టెస్ట్ క్రికెట్‌లో.. ద్వి శతకం చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. 19 ఏళ్ల వయసులో మిథాలి నెలకొల్పిన ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. 89 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. 17 అర్థ శతకాలతో 2 వేల 364 పరుగులు చేశారు. 3 ఫార్మట్లలో కలిపి 10 వేల 868 పరుగులు చేసిన మిథాలీ అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అని ఫార్మట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర లిఖించారు. ఆరు ప్రపంచకప్‌లలో పాల్గొన్న మిథాలీ వరల్డ్ కప్‌లో వరుసగా ఏడు అర్థ శతకాలు సాధించి మరో రికార్డును కూడా నెలకొల్పారు. మిథాలీ సారథ్యంలోని జట్టు 2005, 2017లో ప్రపంచకప్ ఫైనల్‌కి చేరింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన మిథాలీకి ప్రపంచకప్ సాధించాలన్న కల మాత్రం నెరవేరలేదు.