Manjrekar on Kohli: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆల్ టైమ్ గ్రేట్ భారత కెప్టెన్లలో ఒకడిగా కోహ్లీని పరిగణించలేమని పేర్కొన్నాడు. టీమ్ఇండియాకు గతంలో సేవలందించిన కెప్టెన్లతో పోల్చితే కోహ్లీ ఐసీసీ ట్రోఫీలు సాధించడంలో విఫలమయ్యాడని అన్నాడు. కానీ, ఆటగాడిగా మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడని అభిప్రాయపడ్డాడు.
"భారత దిగ్గజ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో అతడు సాధించిన విజయాలు, ఐసీసీ ఈవెంట్లలో సొంతం చేసుకున్న కప్పుల ఆధారంగానే నేను ఈ మాట చెబుతున్నాను. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అంత ఒత్తిడి ఉండదు. కానీ, ఐసీసీ ఈవెంట్లలో చాలా ఒత్తిడి ఉంటుంది. అయినా ధోని గొప్పగా జట్టుని నడిపించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీల్లో భారత్‌ని విజేతగా నిలిపాడు. అందుకే, మనం ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్ల గురించి మాట్లాడేటప్పుడు ధోనిని విస్మరించడం అన్యాయం. అలాగే, అంతర్జాతీయ ఈవెంట్లలో భారత జట్టుని తక్కువగా అంచనా వేసే కాలంలో కపిల్ దేవ్ ప్రపంచకప్ సాధించి సత్తా చాటాడు. మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత సౌరవ్ గంగూలీ విదేశాల్లో కీలక విజయాలు సాధించాడు. భారత్‌పై ఉన్న అపకీర్తిని తొలగించి కాస్త ఊరట కలిగించాడు. సునీల్ గావస్కర్ కూడా జట్టుని మెరుగ్గా నడిపించాడు. అందుకే, వీళ్లంతా గొప్ప సారథులయ్యారు."
-- సంజయ్ మంజ్రేకర్, మాజీ క్రికెటర్.
'వాళ్లతో పోల్చుకుంటే, విరాట్ కోహ్లీలోనూ చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. సారథిగా పోరాట స్ఫూర్తితో భారత జట్టుని నడిపించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వాండరర్స్ టెస్టులో ఓ వైపు వికెట్లు పడుతున్న కోహ్లీ గొప్పగా పోరాడాడు. ఈ సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో ఓటమి పాలైనా విరాట్ ఆటను తక్కువ అంచనా వేయలేం. అతడు ఎప్పుడూ ఓటమిని అంత సులభంగా అంగీకరించడు. ఆఖరి వరకు విజయం కోసం పోరాడుతాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ అతడు గొప్పగా పోరాడాడు. చివరి నిమిషం వరకు మ్యాచ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. అయినా దురదృష్టవశాత్తు జట్టుని విజేతగా నిలుపలేకపోయాడు. ఐసీసీ ఈవెంట్లలో కూడా కోహ్లీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. వ్యక్తిగత ప్రదర్శన దృష్ట్యా గొప్పగా రాణిస్తున్న కోహ్లీ.. అంతర్జాతీయ స్థాయి కప్పులు సాధించడంలో విఫలమయ్యాడు. అందుకే అతడిని ఆల్ టైమ్ గ్రేట్ భారత కెప్టెన్లలో ఒకడిగా పరిగణించలేము' అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.