తెలంగాణ

telangana

ETV Bharat / sports

వందో వన్డేలో సెంచరీ వీరులు.. ఎవరెవరంటే? - వందో మ్యాచ్​లో సెంచరీ వీరులు

ఏ ఆటలోనైనా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని చూస్తారు. మరీ ముఖ్యంగా తమకు అత్యంత ముఖ్యమైన మ్యాచ్​ల్లో ఇంకాస్త మెరుగ్గా ఆడాలని భావిస్తారు. అలా ఎంతో మంది ఆశించినా వాటిని నిజం చేసుకునేది కొందరే. అలా క్రికెట్‌లో తమ వందో వన్డేలో సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌ పలువురు ఉన్నారు. గతరాత్రి టీమ్‌ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ ఓపెనర్‌ షై హోప్‌ కూడా ఈ ఘనత సాధించాడు. దీంతో ఇప్పటివరకు అలా తమ వందో వన్డేలో సెంచరీ కొట్టిన ఆటగాళ్లెవరో.. ఏ జట్టుపై ఎప్పుడు కొట్టారో తెలుసుకుందాం.

100th match 100 century
100th match 100 century

By

Published : Jul 25, 2022, 9:35 PM IST

విండీస్‌ వాళ్లే నలుగురు..తమ వందో వన్డేలో సెంచరీ కొట్టిన మొత్తం బ్యాట్స్‌మెన్‌ 10 మంది. అందులో విండీస్‌ ఆటగాళ్లే నలుగురు ఉండటం విశేషం. ఇక మిగతావారిలో న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, భారత జట్లకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. టీమ్‌ఇండియా నుంచి ఈ జాబితాలో శిఖర్‌ ధావన్‌ ఒక్కడే ఈ అరుదైన ఘనత సాధించాడు.

గార్డన్‌ గ్రీనిడ్జ్‌: 1988లో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ గార్డన్‌ గ్రీనిడ్జ్‌ తొలిసారి ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. పాకిస్థాన్‌తో ఆడిన తన వందో వన్డేలో 102 పరుగులు చేసి కొత్త రికార్డుకు తెరలేపాడు. అయితే, ఆ మ్యాచ్‌లో విండీస్‌ ఓటమిపాలవ్వడం గమనార్హం. మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 294/6 భారీ స్కోర్‌ చేయగా విండీస్‌ ఛేదనలో 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులే చేసింది.

క్రిస్‌ కేన్స్‌: 1999లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌కేన్స్‌ టీమ్‌ఇండియాతో ఆడిన మ్యాచ్‌లో రెండోసారి ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 300/8 స్కోర్‌ చేయగా క్రిస్‌ కేన్స్‌ 115 పరుగులు చేశాడు. అయితే ఛేదనలో భారత్‌ 230 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది.

మహ్మద్‌ యూసుఫ్‌: ఇక 2002లో పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ యూసుఫ్‌ శ్రీలంకతో ఆడిన తన వందో వన్డేలో 129 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 295/6 భారీ స్కోర్‌ చేయగా ఛేదనలో శ్రీలంక 78 పరుగులకే ఆలౌటవ్వడం గమనార్హం. దీంతో పాక్‌ 217 పరుగులతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

కుమార సంగక్కర: 2004లో శ్రీలంక బ్యాట్స్‌మన్‌ కుమార సంగక్కర ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అప్పుడు ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో అతడు 101 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 233 పరుగులు చేయగా ఛేదనలో లంక 193 పరుగులకే కుప్పకూలింది.

క్రిస్‌ గేల్‌: 2004లోనే వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ కూడా ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగిన తన వందో వన్డేలో అది కూడా క్రికెట్‌ మక్కాగా భావించే లార్డ్స్‌ మైదానంలో 132 పరుగులు చేసి ఈ రికార్డులో భాగమవ్వడమే కాకుండా ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 285/7 స్కోర్‌ సాధించగా విండీస్‌ 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది.

మార్కస్‌ ట్రెస్కోతిక్‌: ఇక 2005లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్కస్‌ ట్రెస్కోతిక్‌ సైతం ఈ ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన తన వందో వన్డేలో 100 పరుగులు చేసి ఈ అరుదైన రికార్డులో పాలుపంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 190 పరుగులకే ఆలౌటవ్వగా ఛేదలో ఇంగ్లాండ్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా విజయం సాధించింది.

రామ్‌నరేశ్‌ శర్వన్‌: 2006లో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ రామ్‌నరేశ్‌ శర్వన్‌ కూడా ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. టీమ్‌ఇండియాతో ఆడిన తన వందో వన్డేలో 115 పరుగులు చేశాడు. అప్పుడు భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 245/9 స్కోర్‌ చేయగా విండీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలోనే శర్వన్‌ సైతం అరుదైన రికార్డులో ఏడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.

డేవిడ్‌ వార్నర్‌: 2017లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టీమ్‌ఇండియాపై ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో అతడు 124 పరుగులు సాధించి ఈ జాబితాలో ఎనిమిదో ఆటగాడిగా చేరాడు. అప్పుడు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 334/5 భారీ స్కోర్‌ చేయగా ఛేదనలో టీమ్‌ఇండియా 313/8తో సరిపెట్టుకుంది. దీంతో మ్యాచ్‌ ఓడిపోయింది.

శిఖర్‌ ధావన్‌: 2018లో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ సైతం ఈ అరుదైన రికార్డులో భాగమయ్యాడు. దక్షిణాఫ్రికాతో ఆడిన తన వందో వన్డేలో 109 పరుగులు సాధించి ఈ రికార్డు నెలకొల్పిన తొమ్మదో ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 289/7 స్కోర్‌ చేయగా ఛేదనలో దక్షిణాఫ్రికా 207/5తో నిలిచి డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో గెలిచింది.

షై హోప్‌: ఇక తాజాగా గతరాత్రి వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ షై హోప్‌ ఈ ఘనత సాధించిన పదో ఆటగాడిగా నిలిచాడు. టీమ్‌ఇండియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో హోప్‌ తన వందో వన్డేలో 115 పరుగులు చేసి ఈ రికార్డులో తన పేరు కూడా లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 311/6 స్కోర్‌ చేయగా టీమ్‌ఇండియా 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఇదీ చూడండి: బాక్సర్​ లవ్లీనా సంచలన ఆరోపణలు.. అధికారులు వేధిస్తున్నారంటూ..

ABOUT THE AUTHOR

...view details