Legends League cricket Final: లెజెండ్స్ లీగ్ క్రికెట్లో మాజీ ఆటగాళ్లు అదరగొట్టారు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ తమ పాత రోజులను గుర్తుచేశారు. శనివారం జరిగిన ఫైనల్ ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. సీజే అండర్సన్(94*) సెంచరీకి చేరువగా రాగా, పీటర్సన్(48) హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోరీ అండర్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 231 పరుగులకే పరిమితమైంది. ఈ జట్టులో మహ్మద్ యూసఫ్ 39 టాప్ స్కోరర్. సనత్ జయసూర్య(38), ఉపుల్ థరంగా(25), తిలకరత్నే దిల్షన్(25), అస్గర్ అఫ్గాన్(24) నామమాత్రంగా ఆడారు. వరల్డ్ జెయింట్స్ బౌలర్లలో అల్బి మోర్కల్ 3, మాంటీ పనేసర్ 2, రియాన్ జై, మార్నె మోర్కల్, కెవిన్ పీటర్సన్ తలో వికెట్ తీశారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వరల్డ్ జెయింట్స్‌లో బ్యాటర్లు అదరగొట్టారు. ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించారు. అయితే 65 పరుగులకే 3 వికెట్లు పడిపోయాయి. ఇందులో ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ఒక్కడే మంచి ఇన్నింగ్ ఆడాడు. కేవలం 22 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ కోరి అండర్సన్ ఆసియా లయన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షోయబ్ అక్తర్ వేసిన ఒకే ఓవర్లో పీటర్సన్ ఏకంగా మూడు సిక్సర్లు బాదాడు. కేవలం 43 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 రన్స్ చేశాడు. మిగతా ప్రపంచ దిగ్గజాలు కూడా భీకరంగా బౌండరీలు బాదారు. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ 3 సిక్సర్లు, ఒక ఫోరు బాది 24, డారెన్ సామీ 17 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 38 పరుగులు చేసి రెచ్చిపోయారు. మొత్తంగా నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసియా లయన్స్ బౌలర్లలో కులసేకర 3, సి వాస్, మురళీధరన్ తలో వికెట్ దక్కించుకున్నారు.