lanka premier league 2023 : లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. కొలంబో వేదికగా గాలె టైటాన్స్ - దంబుల్లా ఆరా మధ్య జరిగిన మ్యాచ్‌ను.. వీక్షించడానికి ఓ అనుకోని అతిథి వచ్చి హడల్ పుట్టించింది.
ఇంతకీ అదెవరంటే.. దంబుల్లా జట్టు బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఓ పాము స్టేడియంలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చింది. క్రీజులో ధనంజయ్ డిసిల్వా, కుశాల్ పెరీరా ఆడుతుండగా.. మైదానంలోకి వచ్చింది. కాసేపు అక్కడక్కడే తిరిగింది. దాన్ని స్టేడియంలోని స్క్రీన్‌పై కూడా చూపించారు. ఆ సమయంలో ఒక్క సారిగా అక్కడి ప్లేయర్లు.. పామును చూసి ఉలిక్కిపడ్డారు. దీంతో కాసేపు ఓ పది నిమిషాల పాటు మ్యాచ్‌ను ఆపేశారు నిర్వాహకులు.
ఇక ఆ పామును చూసిన అంపైర్లు.. వెంటనే మైదానంలోని భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పామును పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో దంబుల్లా జట్టుపై గాలే టైటాన్స్ విజయాన్ని సాధించింది. ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన గాలె టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. భానుక రాజపక్స(48), కెప్టెన్ దాసున్ షనక(42 నాటౌట్) మంచిగా ఆడారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన దంబుల్లా తన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక ఈ సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్‌కు దిగిన దంబుల్లా వికెట్ కోల్పోయి 9 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన గాలె టైటాన్స్.. రెండు బంతుల్లోనే 11 పరుగులు చేసింది. ఫలితంగా విజయాన్ని అందుకుంది. గాలె టైటాన్స్ ఓపెనర్ రాజపాక్స వరుసగా ఓ సిక్స్, ఓ ఫోర్ కొట్టేసి తమ టీమ్‌కు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు.
ఇదీ చూడండి :
Ashes series eng vs aus fifth test 2023 : బ్రాడ్ అదరహో.. రసవత్తరంగా సిరీస్ ఆఖరి రోజు.. ఇంగ్లాండ్‌దే విజయం
Stuart Broad On Yuvraj Singh : యువరాజ్ వల్లే సక్సెస్ అయ్యా.. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను : బ్రాడ్