Kohli reaction on Centurion Test: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ క్రెడిట్.. సెంచరీ, అర్ధశతకంతో చెలరేగిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌కు దక్కుతుందని అన్నాడు కెప్టెన్ కోహ్లీ. బౌలర్లలో షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. మొత్తంగా జట్టు సమిష్టిగా రాణించిందని పేర్కొన్నాడు.
"ఈ పర్యటనలో మాకు శుభారంభం దక్కింది. వర్షం కారణంగా ఒక రోజు ఆట (రెండో రోజు) పూర్తిగా తుడిచిపొట్టుకుపోయినా మేము చాలా బాగా ఆడాం. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో ఆడటం ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది. విదేశాల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం సవాలుతో కూడుకున్నది. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు సాధించడానికి మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ కారణం. బౌలర్లు రాణిస్తారని మాకు తెలుసు. క్లిష్ట పరిస్థితుల్లో మా బౌలర్లు సమష్టిగా బౌలింగ్ చేయడంతో జట్టు ఈ ఫలితాన్ని పొందింది. షమి కచ్చితంగా అద్భుతమైన, ప్రపంచస్థాయి బౌలర్. ప్రస్తుతం ప్రపంచంలోని ముగ్గురు అత్యుత్తమ పేసర్లలో అతడు ఒకడు" అని విరాట్ పేర్కొన్నారు.
రెండు జట్ల మధ్య తేడా అదే
"తొలి టెస్ట్ ఓడిపోవడం బాధాకరం. మేం కొన్ని తప్పులు చేశాం. అయితే, కొన్ని సానుకూలతలు కూడా బయటికి వచ్చాయి. రాబోయే రెండు టెస్టుల్లో మేం వాటిని ఉపయోగించుకోవాలి. భారత ఓపెనర్లు రాణించారు. తొలుత మా బౌలర్లు సరైన లెంగ్త్‌లో బంతులు వేయలేదు. కొన్నిసార్లు చర్చించిన తర్వాత బౌలింగ్‌లో మార్పు కనిపించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశాం. 20 వికెట్లు తీయడానికి మా బౌలర్లు పడిన కష్టాన్ని చెప్పలేం. మా బ్యాటర్లు నిరాశపరిచారు. రెండు జట్ల మధ్య బ్యాటింగ్‌లో తేడా ఉంది. ఈ విషయంపై జట్టు యాజమాన్యంతో చర్చించాలి" అని ఎల్గర్ తమ జట్టు ఆటతీరు గురించి వివరించాడు.