టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఆటను కనబరిచి తన సత్తా ఎంటో చూపించాడు కేఎల్ రాహుల్. టీమ్ఇండియా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొన్నాడు. విమర్శించిన వారే ప్రశంసించేలా తన ఆటను మార్చుకున్నాడు. అయితే మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో దాదాపు 20 నిమిషాలు సుదీర్ఘంగా స్టార్ బ్యాటర్ కోహ్లీతో ఏదో విషయంపై రాహుల్ సీరియస్‌గా మాట్లాడుతూ కనిపించాడు. అనంతరం మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో రాహుల్- కోహ్లీ మధ్య ఏం చర్చ జరిగిందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మ్యాచ్ అనంతరం కోహ్లీతో ఏం చర్చించాడో రాహుల్ బయటపెట్టాడు.
"మేము గతంలో ఆస్ట్రేలియాకు వచ్చిన నాటి పరిస్థితులు.. తాజా పరిస్థితుల్లో మార్పుల గురించి మాట్లాడుకున్నాం. గతంలో మేం వచ్చినప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడాం. మేము వికెట్లపై ఓ విధంగా ఆడటానికి అవకాశం ఉంటుందని భావించాం. కానీ, ఇప్పటి వరకు అలా జరగలేదు. గత పర్యటనలో కంటే పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. మేం అదే విషయం మాట్లాడుకొన్నాం. దీంతోపాటు మానసిక పరిస్థితి గురించి, పరిస్థితులను ఎదుర్కోవడం గురించి చర్చించుకొన్నాం. మధ్యలో అతడు చెప్పే విషయాలు నన్ను మెరుగుపర్చుకోవడానికి ఏమైనా ఉపయోగపడతాయేమో తెలుసుకొన్నాను. సాధారణంగా క్రీడాకారుల మధ్య ఇటువంటి చర్చలు జరుగుతాయి. గత కొన్ని మ్యాచుల్లో అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. వివిధ పరిస్థితుల్లో అతడి ఆలోచనాతీరును అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించాను" అని కేఎల్ రాహుల్ వివరించాడు.