PBKS and SRH Complaint: ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ త్వరలోనే జరగనుంది. ఈ మేరకు 8 ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను మంగళవారం(నవంబర్ 30) సమర్పించాలని బీసీసీఐ తెలిపింది. అయితే.. వచ్చే ఏడాది ఐపీఎల్లో పోటీ పడేందుకు రెండు కొత్త జట్లు కూడా సిద్ధమవుతున్నాయి.
ఈ మెగా వేలం నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ జట్టు సారథిగా వ్యవహరించిన కేఎల్ రాహుల్(KL Rahul PBKS), సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్(Rashid Khan SRH) తమ ఫ్రాంఛైజీలతో కొనసాగలేమని చెప్పేసినట్లు సమాచారం. అయితే.. లఖ్నవూ ఫ్రాంఛైజీ ఈ ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ముందుగానే వారిని కలిసిందని తెలిసింది. ఈ క్రమంలో తమ ఆటగాళ్లను కొత్త ఫ్రాంఛైజీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని పీబీకేఎస్, ఎస్ఆర్హెచ్ జట్లు ఫిర్యాదు చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
"తమ జట్టు ఆటగాళ్లను లఖ్నవూ ఫ్రాంఛైజీ మభ్యపెట్టేందుకు ప్రయత్నించిందని పంజాబ్ కింగ్స్, ఎస్ఆర్హెచ్లు ఫిర్యాదు చేశాయి. లిఖితపూర్వక కంప్లైంట్ మాత్రం ఇంకా ఇవ్వలేదు. కానీ, దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. ఇది నిజమని తెలిస్తే.. కొత్త ఫ్రాంఛైజీపై కఠిన చర్యలు తీసుకుంటాం." అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల వివరాలను సమర్పించకముందే ఇలా ఆటగాళ్లను కలవడం బీసీసీఐ తప్పుగానే పరిగణిస్తుందని అధికారి స్పష్టం చేశారు. ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ఉండే ప్రసక్తేలేదని అన్నారు.