ఇండియాలో క్రికెట్ ఓ మతం అంటుంటారు. దానికి తగ్గట్టుగానే క్రికెటర్లను దేవుళ్లుగా కొలుస్తారు అభిమానులు. తమ అభిమాన ఆటగాడి కోసం కటౌట్లు కడతారు, టీ షర్టులపై బొమ్మలు, పచ్చ బొట్టు వేయించుకుంటారు. ఆ కోవలోనే నడిచాడు మరో అభిమాని. ఈ ఫ్యాన్ ఇంకొంచెం కొత్తగా ఆలోచించాడు. తన పెళ్లి శుభలేఖపై వినాయకుడి ఫొటోతో పాటు తన అభిమాన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫొటో కూడా ప్రింట్ చేయించాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలోని ఓ ఫొటోను పెళ్లి కార్డుపై ముద్రించాడు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ధోనీ జెర్సీ నంబర్ 7 ఉద్దేశిస్తూ.. "అతడు 7 జన్మల బంధం కోసం 7 అడుగులు వేయాలనుకున్నాడు." అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'మొదట చూసినప్పుడు ఇది ధోనీ వెడ్డింగ్ కార్డు అనుకున్నా..' అన్నీ ఫన్నీగా రాసుకొచ్చాడు. అయితే ఆ అభిమాని పెళ్లికి ధోనీ గెస్ట్‌గా వస్తాడేమోనని కామెంట్ చేశాడు మరో నెటిజన్.
వెడ్డింగ్ కార్డుపై 'ధోనీ' ఫొటో.. పెళ్లికి చీఫ్ గెస్ట్ కూడా అతడే! - పెళ్లి పత్రికపై ధోని ఫొటో కర్ణాటక ఫ్యాన్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్లేయర్ ఎమ్ఎస్ ధోనీ. తన ఆటతో అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఓ ధోనీ ఫ్యాన్ చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమైంది. తన పెళ్లి శుభలేఖపై ధోనీ ఫొటో ప్రింట్ చేయించి.. అతడిపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.
సౌరభ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు భారత క్రికెట్ జట్టులోకి ఆడుగుపెట్టిన ధోనీ.. ఆ తర్వాత భారత క్రికెట్ స్వరూపాన్ని సమూలంగా మార్చేశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ చెరగని అధ్యాయం లిఖించాడు. ఓ దశాబ్దం పాటు క్రికెట్‌ను శాసించాడు. దిగ్గజాలు సైతం సలాం చేసే స్థాయికి ఎదిగాడు. మైదానంలో ధోనీ ఉంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా టీమ్ గెలుస్తుందని అభిమానులు అనుకునేంతలా.. అతడి ప్రదర్శన ఉండేది. కెప్టెన్‌గా జట్టును నడిపించిన తీరు కూడా అతడిని అగ్రస్థానానికి తీసుకెళ్లింది. ధోనీ సారథ్యంలోనే 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌ను టీమ్ఇండియా గెలిచింది. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ధోనీ.. అంచెలంచెలుగా ఎదిగి క్రికెటర్ కావాలనున్న వారిలో స్ఫూర్తి నింపాడు. అలాంటి మహీకి ఇలాంటి అభిమానులుండటం సహజమే.
అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బాయ్ చెప్పిన ధోనీ.. మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. టీమ్ఇండియా కెప్టెన్‌గా జట్టును అగ్ర స్థానంలో నిలబెట్టిన ధోనీ.. ఇప్పటి వరకు 90 టెస్టులు ఆడాడు. అందులో 4876 పరుగులు చేశాడు. ఆరు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 224 నమోదు చేశాడు. ఇక 350 వన్డేల్లో 297 ఇన్నింగ్స్‌లో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలతో 10,773 పరుగులు బాదాడు. అత్యధికంగా 183 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 98 అంతర్జాతీయ టీ20లు ఆడిన ధోనీ.. 1,617 పరుగులు చేశాడు. ఇక, ఈసారి ఐపీఎల్‌ను ఉచితంగా ప్రసారం చేస్తున్న జియో సినిమాకు అంబాసిడర్‌గా ధోనీ వ్యవహరిస్తున్నాడు.