IPL Extended Two and half months: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ను 75 రోజులపాటు నిర్వహించేలా బీసీసీఐ తన చర్యలను ముమ్మరం చేసింది. ఐసీసీ భవిష్యత్తు పర్యటనల జాబితాలోనూ చేరుస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. కొత్త ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదని అన్నాడు. ప్రస్తుతం ఉన్న ప్రకారం పది జట్లతోనే నిర్వహిస్తామన్నాడు.
"భారత టీ20 లీగ్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని ఐసీసీతోపాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నాం. వచ్చే ఏడాది టీ20 లీగ్‌ను రెండున్నర నెలలపాటు నిర్వహించేలా ఐసీసీ క్యాలెండర్‌లోనూ అవకాశం కల్పిస్తాం. టాప్ ఆటగాళ్లు తప్పకుండా హాజరవుతారు. ఈ లీగ్‌ను విస్తరించే క్రమంలో ఆట నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. క్షేత్రస్థాయి నుంచి బలంగా ఉండేలా చర్యలు చేపడుతూనే ఉంటాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తాం" అని జై షా పేర్కొన్నాడు.