Harbhajan Singh On Rohit Sharma : గత నెలలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్- డబ్ల్యూటీసీ ఫైనల్‌లో.. 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం మూటగట్టుకుంది. రహానె తప్ప మిగతా వాళ్లందరూ తేలిపోయారు. అప్పటి నుంచి ప్లేయర్లపై విమర్శలు వస్తున్నాయి. ఇక, రోహిత్ శర్మ కెప్టెన్ స్థానం నుంచి తప్పుకోవాలంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోహిత్ శర్మ సరైన నిర్ణయాల తీసుకోకపోవడం వల్లే భారత్ ఓడిపోయిందని.. పలువురు మాజీలు సైతం విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రోహిత్ శర్మకు మద్దతుగా మాట్లాడాడు. అక్టోబర్‌లో వన్డే ప్రపంచకప్ ఉన్నందున.. భారత క్రికెట్ నియంత్రణ మండలి- బీసీసీఐ.. రోహిత్‌కు అన్ని రకాలుగా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని భజ్జీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అప్పుడే అతడు కెప్టెన్‌గా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలడని అన్నాడు. టీమ్ఇండియాతో పాటు ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టులోని ప్రతి ఒక్కరూ రోహిత్ శర్మను ఎంతో గౌరవిస్తారని హర్భజన్ గుర్తు చేశాడు.
"రోహిత్ శర్మ సారథ్యంపై వస్తున్న విమర్శలు గమనిస్తున్నా. ఈ విషయంలో కొంతమంది కాస్త అతిగా మాట్లాడుతున్నట్లు అర్థమవుతోంది. క్రికెట్ అనేది ఒక టీమ్ ఆట. ఒక్క ప్లేయర్ జట్టును ఉన్నతస్థాయిలో నిలబెట్టలేడు. అవును, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ఇండియా బాగా రాణించలేదు. కానీ, ఒక్క రోహిత్ శర్మనే విమర్శించడం అన్యాయం. అతడు అద్భుతమైన కెప్టెన్. ఇటీవల వచ్చిన ఫలితాల ఆధారంగా అతడి కెప్టెన్సీపై ఓ అంచనాకు రావడం సరైనది కాదు. రోహిత్ మళ్లీ రాణిస్తాడు. అతడిపై విశ్వాసం ఉంచి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. బీసీసీఐ నుంచి సపోర్ట్ ఉంటే రోహిత్ స్వేచ్ఛగా పని చేసుకోవచ్చు"
-- హర్భజన్ సింగ్, టీమ్ఇండియా మాజీ స్నిన్నర్
ధోనీ, విరాట్ కోహ్లీలతోపాటు చాలామంది కెప్టెన్లకు బీసీసీఐ నుంచి మద్దతు లభించిందని.. రోహిత్‌కు కూడా బీసీసీఐ నుంచి మద్దతు లభిస్తోందని హర్భజన్ అన్నాడు. అయితే, అది ఏ స్థాయిలో ఉందో తనకు తెలియదని.. ఆ రకమైన సపోర్ట్ ఉంటే సరైన సమయంలో రోహిత్ సరైన నిర్ణయం తీసుకుంటాడని అన్నాడు. ఆ మద్దతు ఉంటే అతడికి స్వేచ్ఛ లభిస్తుందని.. బీసీసీఐ తన కెప్టెన్లందరికీ ఏ విధంగానైతే మద్దతుగా నిలిచిందో రోహిత్ శర్మకు కూడా అదే విధంగా అండగా నిలవాలని అని హర్భజన్ సింగ్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.