ఐపీఎల్ రెండో దశలో(IPL 2021) వరుస అపజాయలతో సతమతమతున్న ఇద్దరు స్టార్ కెప్టెన్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రెండో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్(RCB Vs MI) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇప్పటికే 9 మ్యాచ్లు ఇరుజట్లు ఆడగా.. 5 మ్యాచ్ల్లో గెలిచిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో(IPL Points Table 2021) మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు ముంబయి ఇండియన్స్ 4 మ్యాచ్ల్లో నెగ్గి.. 6వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో నెగ్గి ఐపీఎల్ ప్లేఆఫ్స్(IPL Playoffs 2021) రేసులో ముందుకెళ్లాలని ఇరు జట్లు ప్రణాళికలను రచిస్తున్నాయి.
కోహ్లీసేన గట్టెక్కేనా..?
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే బ్యాటింగ్ విభాగంలో ఆర్సీబీ గాడిన పడాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. కానీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నిలకడగా క్రీజులో నిలవాల్సిన అవసరం ఉంది. ఇటీవలే చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్నిచ్చినా.. మిడిల్ ఆర్డర్ దాన్ని నిలుపుకోవడంలో విఫలమయ్యారు.
బ్యాట్స్మెన్ మ్యాక్స్వెల్, డివిలియర్స్ నుంచి ఆర్సీబీ అభిమానులు మరింత ప్రదర్శన ఆశిస్తున్నారు. బౌలింగ్ విభాగంలోనూ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్లో హర్షల్ పటేల్, చాహల్ పర్వాలేదనిపించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ బౌలింగ్ వేసి వికెట్ పడగొట్టాడు.
ముంబయికి విజయం దక్కేనా?
ఐపీఎల్ రెండోదశలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిని ఎదుర్కొన్న ముంబయి ఇండియన్స్ ఆడిన 9 మ్యాచ్ల్లో నాలుగింటిలో నెగ్గి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్లో ముంబయి జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.