IPL 2022 KKR: టోర్నీ ప్రారంభానికి ముందే కోల్‌కతాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణం శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించడమే. అంతకుముందు అతడు దిల్లీ తరఫున బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా రాణించి ఆ జట్టును మెరుగైన స్థితికి తీసుకొచ్చాడు. దాన్ని ఇప్పుడు పంత్ ముందుకు నడిపిస్తున్నాడు. మరోవైపు గతేడాది కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్న ఇయాన్ మోర్గాన్ బ్యాట్స్‌మన్‌గా విఫలమైనా.. తన కెప్టెన్సీ అనుభవంతో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే, ఈ సీజన్‌కు ముందు శ్రేయస్ బ్యాటింగ్ పరంగానూ అత్యుత్తమ ఫామ్‌లో ఉండటం వల్ల ఈసారి ఆ జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తీరా చూస్తే ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి. వరుసగా ఐదు ఓటముల పాలై ఎనిమిదో స్థానానికి దిగజారింది. ఇలాంటి స్థితిలో కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు చేరడం చాలా కష్టమే.
టాప్ ఆర్డర్ తడబాటు..:గతేడాది సగం సీజన్ పూర్తయ్యేసరికి కూడా కోల్‌కతా ఇలాగే పలు ఓటములతో సతమతమైంది. కానీ, రెండో లెగ్‌లో వెంకటేశ్ అయ్యర్ ఓపెనర్‌గా బరిలోకి దిగాక ఆ జట్టు స్వరూపమే మారిపోయింది. రెండు చేతులా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు ఎవరూ ఊహించని రీతిలో బ్యాటింగ్ చేశాడు. నాలుగు అర్ధ శతకాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో కోల్‌కతా ఉత్కంఠపరిస్థితుల నడుమ నెట్ రన్‌రేట్‌తో పోటీపడి ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది. అలాగే వెంకటేశ్‌కు.. శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, సునీల్ నరైన్ పలు సందర్భాల్లో మంచి సహకారం అందించారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈసారి వెంకటేశ్ ఓపెనర్‌గా విఫలమవుతున్నాడు. అతడికి జోడీగా అజింక్య రహానె, ఆరోన్ ఫించ్‌లు చెరో ఇన్నింగ్స్‌లోనే ఆకట్టుకున్నా తర్వాత చేతులెత్తేశారు. ఈ ముగ్గుర్ని మార్చి చూసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ప్రస్తుతం కోల్‌కతా జట్టుకు సరైన టాప్ఆర్డర్ కాంబినేషన్‌ను సెట్ చేసుకోవడమే కష్టంగా మారింది. ఈ మాటలు స్వయంగా శ్రేయస్ అయ్యరే గతరాత్రి ఓటమి అనంతరం వెల్లడించడం ఆ జట్టు పరిస్థితిని తెలియజేస్తుంది.
శ్రేయస్ అయ్యర్ అంతంతే..:కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 20*, 13 , 26, 10 పెద్దగా రాణించింది లేదు. మధ్యలో దిల్లీ, రాజస్థాన్ జట్లపై 54, 85 అర్ధ శతకాలతో మెరిసినా జట్టును విజయతీరాలకు చేర్చలేదు. ఈ క్రమంలోనే హైదరాబాద్, గుజరాత్ జట్లపైనా మళ్లీ విఫలమయ్యాడు. చివరగా గతరాత్రి దిల్లీపై 42 పరుగులు చేశాడు. దీంతో అతడు ఈ సీజన్లో బ్యాట్స్‌మన్‌గా 290 పరుగులు చేసి నామమాత్రంగా రాణిస్తున్నాడు. శ్రేయస్ అంటేనే నిలకడగా పరుగులు సాధించగల సత్తా ఉన్న ఆటగాడు. కానీ, ప్రస్తుత టోర్నీలో మాత్రం తన స్టామినాకు తగ్గ ప్రదర్శనలు చేయలేకపోతున్నాడు. అలాగే కెప్టెన్‌గానూ మైదానంలో చురుగ్గా కనిపించడంలేదు. పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవడంలోనూ మునుపటిలా ప్రభావవంతంగా కనిపించడం లేదు.