చెన్నై సూపర్‌కింగ్స్ అనగానే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చేది ధోనీనే. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై ఎదగడంలో సారథి ధోనీ పాత్ర కీలకం. అయితే.. ఇప్పటికే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రం చెన్నైని నడిపిస్తున్నాడు. మరి వచ్చే సీజన్‌లోనూ ధోనీ చెన్నై జెర్సీ ధరించి మైదానంలోకి దిగుడతాడన్నది అనుమానమే. మరి లీగ్‌లో చెన్నైలాంటి ప్రతిభావంతమైన జట్టును ధోనీ స్థాయిలో నడిపించాలంటే ఎవరి వల్ల సాధ్యం.. అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. అయితే.. ఈ విషయంలో భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ఒక సూచన చేశాడు. చెన్నై కెప్టెన్‌గా ధోనీ స్థానాన్ని కేన్ విలియమ్సన్ మాత్రమే భర్తీ చేయగలడన్నాడు.
కేన్ విలియమ్సన్ ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. ఒకవేళ తర్వాతి సీజన్‌లో ధోనీ ఆడకపోతే కేన్ విలియమ్సన్‌ను చెన్నై దక్కించుకునే అవకాశం ఉందని ఓజా అభిప్రాయం వ్యక్తం చేశాడు. హైదరాబాద్ జట్టు కూడా కేన్‌ను సరైన విధంగా ఉపయోగించుకోలేక పోతోందన్నాడు. కెప్టెన్‌గా విలియమ్సన్‌కు ఏదైనా సహకారం కావాలంటే వైస్ కెప్టెన్‌గా జడేజా ఉన్నాడన్నాడు.