సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మరోసారి ఓటమిని చవి చూసింది. ఉప్పల్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎక్కువ శాతం ఆధిపత్యం కనబరిచనట్లే అనిపించినప్పటికీ ఆఖర్లో చేతులెత్తేసింది. దీంతో సన్‌రైజర్స్.. 5 పరుగుల తేడాతో కోల్‌కతా చేతిలో ఓడింది. మొదట కోల్‌కతా 9 వికెట్లకు 171 పరుగులనే సాధించగలిగింది. రింకు సింగ్, నితీశ్ రాణా రాణించారు. నటరాజన్, మార్కో జాన్సన్ ఆ జట్టును కట్టడి చేశారు. ఆ తర్వాత దిగిన సన్‌రైజర్స్ 8 వికెట్లకు 166 పరుగులే స్కోర్ చేసింది. కెప్టెన్ మార్‌క్రమ్, క్లాసెన్ , అబ్దుల్ సమద్ పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి మెరిశారు. కాగా ఈ గెలుపుతో కోల్‌కతా తన ప్లేఆఫ్స్ అవకాశాల్ని సజీవంగానే ఉంచుకుంది.
ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టినప్పటికీ.. హర్షిత్ రాణా బౌన్సర్‌తో అగర్వాల్‌ను బోల్తాకొట్టించాడు. తర్వాతి ఓవర్లో వచ్చిన అభిషేక్‌ను సైతం శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. నటరాజన్ స్థానంలో ఇంపాక్ట్ ఆటగాడిగా వచ్చిన రాహల్ త్రిపాఠి.. రసెల్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు. రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌తో చెలరేగాడు. అదే జోరులో మరో స్కూప్ షాట్‌కు ప్రయత్నించే సమయంలో ఫైన్‌లెగ్‌లో వైభవ్ అరోరా చేతికి చిక్కాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్ 53/3 స్కోరుతో నిలిచింది.