ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 4న గుజరాత్ టైటాన్స్-దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే హోమ్ గ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ హాజరయ్యాడు. ఫిజియో సాయంతో మ్యాచ్‌కు హాజరైన పంత్.. దిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చొని మ్యాచ్‌ను వీక్షిస్తూ ఎంజాయ్ చేశాడు. అయితే పంత్‌ను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. 'మిస్ యూ పంత్'.. ఆర్పీ 17 అంటూ బ్యానర్లు, ఫ్లకార్డులు పట్టుకుని కనిపించారు.
కాగా, ఈ మ్యాచ్‌లో షార్ట్, వైట్ టీషర్ట్ వేసుకున్న పంత్.. కర్ర సాయంతోనే మ్యాచ్‌కు వచ్చాడు. ఫ్యాన్స్‌కు అభివాదం చేసిన అతడు.. ఆ తర్వాత దిల్లీ క్యాపిటల్స్ డగౌట్ వైపు చిరునవ్వుతో చూశాడు. అతడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, నవ్వు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే పంత్‌ను చూసిన సౌరవ్ గంగూలీ, హెడ్‌కోచ్ పాంటింగ్ సహా దిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇకపోతే గతేడాది డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు రిషభ్ పంత్. దీంతో జాతీయ జట్టు ఆడే మ్యాచులతో పాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న అతడు మెల్లగా కోలుకుంటున్నాడు. అయితే తాము పంత్‌ను మిస్ అవుతున్నట్లు.. దిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే పలుసార్లు చెబుతూ వచ్చింది. దీంతో ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఆడిన తొలి మ్యాచ్‌కు.. డగౌట్‌లో పంత్ జెర్సీని ప్రదర్శించింది. అయితే దిల్లీ క్యాపిటల్స్ ఇలా చేయడంపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. భౌతికంగా దూరమైనవారికే మాత్రమే అలాంటి గౌరవం ఇస్తారని.. పంత్ మనతోనే ఉన్నాడని ఇలాంటివి మళ్లీ చేయొద్దని హెచ్చరించింది. దీంతో బీసీసీఐకి క్షమాపణ చెప్పిన దిల్లీ ఫ్రాంచైజీ.. పంత్‌ను స్టేడియానికి తీసుకొచ్చింది. మ్యాచ్‌లు ఆడకపోయినా పంత్ తమతో ఉంటే ధైర్యంగా ఉంటుందని ఆ జట్టు హెడ్ కోచ్ పాంటింగ్ అన్నాడు.
ఈ మ్యాచ్ విషయానికొస్తే.. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. తాజా సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. ఫస్ట్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఆ టీమ్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ బాగా రాణించింది.
ఇదీ చూడండి:'రిషభ్ పంత్ జెర్సీతో అలా చేస్తారా?'.. బీసీసీఐ అసంతృప్తి