టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన ఆటతీరుకు ఫిదా అయిన అభిమానులు అతడిని ముద్దుగా మిస్టర్ కూల్ అని, తలైవా అని పిలుచుకుంటుంటారు. అన్నీ ఫార్మాట్లలోనూ అదరగొట్టే ఈ ప్లేయర్ ఐపీఎల్లో తనదైన శైలిలో అదరగొడతాడు. గత కొన్నేళ్లుగా సీఎస్కే టీమ్‌కు సారథిగా వ్యవహరిస్తూ ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో గెలిపించి నాలుగు సార్లు జట్టుకు కప్‌ను అందించాడు. అయితే 2008 నుంచి సీఎస్కే టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ రిటైర్మెంట్ను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న మహీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన స్టార్‌ను ఇక ఎల్లో జెర్సీలో చూడలేం అంటూ బాధపడుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా రిటైర్మెంట్ చేయొద్దంటూ కోరుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఓ అభిమాని.. ధోనీ రిటైర్ అవ్వద్దంటూ స్వయంగా అతడినే కోరాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
ఏప్రిల్ 8న ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడేందుకు సీఎస్కే టీమ్ చెన్నై నుంచి ముంబయికి పయనమౌతోంది. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కింది టీమ్. అయితే ఈ విషయం తెలుసుకున్న పైలట్ విమానం టేకాఫ్ అయ్యే ముందు ఓ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అలా ధోనీతో ఆ పైలట్ మాట్లాడాడు. "ఎంఎస్ ధోనీ.. నేను మీకు చాలా పెద్ద అభిమానిని. దయచేసి ఇంకొంత కాలం సీఎస్కేకు కెప్టెన్‌గా కొనసాగండి. ఈ సారి మాత్రం మీరు రిటైర్మెంట్ ప్రకటించొద్దు" అంటూ కోరాడు. పైలట్ మాటలు విన్న ప్యాసెంజర్స్ ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు.
అయితే ఇదే తన చివరి సీజన్ అని ధోనీ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అంతే కాక రిటైర్మెంట్ రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించలేదు. మరోవైపు సీఎస్కే ప్లేయర్స్ కూడా ఈ విషయంపై ఇటీవలే స్పందించారు. "అలాంటిదేమీ లేదు.. ధోనీ ఫిట్‌గా ఉన్నాడు. మరో రెండు మూడేళ్లు పాటు ఆడతాడు" అని తెలిపారు.
ఇటీవలే సొంత గడ్డపై లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్లో తొలి విజయాన్ని సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్. అయితే ఆ మ్యాచ్ అంత ఈజీగా గెలవలేదు. 13 వైడ్లు, 3 నోబాల్స్ వేసి అదనపు పరుగులు ఇచ్చిన బౌలర్ల వల్ల విజయం కోసం సీఎస్కే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అయిపోయాక బౌలర్ల ప్రదర్శనపై ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ఆట శైలిని మార్చుకోకపోతే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.