ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బెంగళూరులోని ఎమ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, తుది వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్లు ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు మూడో వికెట్‌కు.. అత్యధిక పరుగుల పార్టనర్షిప్ నమోదు చేసిన జోడీగా రికార్డు బద్దలుగొట్టారు. ఇది మాత్రమే కాకుండా కొన్ని రోజుల క్రితం తాము చేసిన రికార్డునే తిరగరాశారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ (62) పరుగులు చేశారు. మ్యాక్స్‌వెల్ (77) పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే వీరిద్దరూ మూడో వికెట్‌కు 127 పరుగుల పార్టనర్‌షిప్‌ను నెలకొల్పారు. 67 బంతుల్లో ఈ ఫీట్ సాధించారు. అంతకుముందు ఏప్రిల్ 17న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులతో భాగస్వామ్యంతో రికార్డు సృష్టించారు. ఇక, ఇదే మ్యాచ్‌లో డుప్లెసిస్ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 9000 పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఐదు అర్ధ శతకాలు సాధించాడు.
విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. కలసిరాని ఆ తేదీ..
ఐపీల్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అతి ఎక్కువ సార్లు గోల్డెన్ డకౌట్ అయిన ప్లేయర్ల లిస్ట్‌లో రెండు స్థానంలో ఉన్నాడు. ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌తో కలిపి.. ఇప్పటివరకు 7 సార్లు.. పరుగులు చేయకుండా మొదటి బంతికే పెవిలయన్ చేరాడు. ఈ లిస్ట్‌లో కోహ్లీ.. సునీల్ నరైన్స హర్భజన్ సింగ్ రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో గుజరాత్ జట్టు ప్లేయర్ రషీద్ ఖాన్.. 10 గోల్డెన్ డకౌట్లతో మొదటి ప్లేస్‌లో ఉన్నాడు.
హోమ్ గ్రౌండ్లో కోహ్లీ మెరుపు షాట్లను చూడాలని ఎంతో ఆశతో వచ్చిన అభిమానులు విరాట్ నిరాశ పరిచాడు. ఓపెనర్‌గా దిగిన కోహ్లీ బౌల్ట్ బౌలింగ్‌లో మొదటి బాల్‌ను ఎదుర్కొన్నాడు. బౌల్ట్ వేసిన ఇన్స్వింగ్కు.. షాట్ ప్రయత్నించి.. కోహ్లీ ఎల్బీడబ్ల్యూ (లెగ్ బిఫోర్ వికెట్) అయ్యాడు. నిరాశతో వెనుదిరిగాడు. 2017 నుంచి ఇప్పటివరకు ఏప్రిల్ 23న జరిగిన మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గోల్డెన్ డకౌటయ్యాడు. 2017లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్ అయిన కోహ్లీ.. గతేడాది(2022) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్ అయ్యాడు.