IPL 2022 Yuzvendra Chahal: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు ఆ జట్టు మాజీ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్. ఆర్సీబీ నుంచి వైదొలిగిన తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాట్లాడానని చెప్పాడు. "నీవు ఎప్పుడూ రాయల్వే అంటూ" కోహ్లీ తనను అభినందించాడని తెలిపాడు. జట్టుతో కొనసాగమని బెంగళూరు మేనేజ్‌మెంట్ బృందం తనను అడిగి ఉంటే కచ్చితంగా ఒప్పుకునేవాడినని యుజ్వేంద్ర చాహల్ చెప్పాడు.
"నా మొదట కుటుంబంతో తిరిగి కలవడం సంతోషంగా ఉంది. రాజస్థాన్ తరపున ఆడేందుకు ఎదురు చూస్తున్నా. బెంగళూరుతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆ జట్టుతో భావోద్వేగ బంధం ఏర్పరుచుకున్నా. ఆ జట్టుకు కాకుండా మరో జట్టుకు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కువ డబ్బు డిమాండ్ చేసి ఆ జట్టు నుంచి వెళ్లిపోయానని సామాజిక మాధ్యమాల్లో అంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. బెంగళూరు డైరెక్టర్ హెసన్ నాకు ఫోన్ చేసి ముగ్గురు ఆటగాళ్ల (కోహ్లి, సిరాజ్, మ్యాక్స్‌వెల్)ను అట్టిపెట్టుకుంటున్నామని చెప్పారు. నన్ను అట్టిపెట్టుకునే విషయం కానీ లేదా డబ్బు గురించి కానీ ఏం అడగలేదు. వేలంలో కొనుగోలు చేస్తామన్నారు. ఒకవేళ వాళ్లు జట్టుతో కొనసాగిస్తామని చెబితే సంతోషంగా ఒప్పుకునేవాణ్ని. డబ్బు ముఖ్యం కాదు. బెంగళూరు నాకెంతో ఇచ్చింది. ఇప్పుడు రాజస్థాన్‌కు ఆడబోతున్నంత మాత్రాన నా బౌలింగ్ మారదు. జెర్సీ మాత్రమే మారింది. వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉన్న మా జట్టు టైటిల్ గెలిచే అవకాశం ఉంది"