తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాజస్థాన్​ X బెంగళూరు.. ఎవరి బలమెంత.. ఫైనల్​కు వెళ్లేదెవరు? - రాజస్థాన్​ రాయల్స్​

IPL 2022 Qualifier 2: భారత టీ20 లీగ్‌ చివరి అంకానికి చేరింది.ప్లే ఆఫ్స్‌లో భాగంగా శుక్రవారం రాజస్థాన్‌, బెంగళూరు మధ్య క్వాలిఫయర్‌-2 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్స్‌లో గుజరాత్‌తో తలపడతుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌, బెంగళూరు జట్ల పరిస్థితి ఎలా ఉంది? ఇంతకుముందు ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో అధిపత్యం ఎవరిది? అనే విషయాలకు సంబంధించిన 10 పాయింట్లు ఇవే..

IPL Qualifier 2
IPL Qualifier 2

By

Published : May 27, 2022, 5:20 AM IST

IPL 2022 Qualifier 2 Match RR Vs RCB: ఐపీఎల్ 2022 సీజన్‌ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. తొలి క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ రాయల్స్​పై గుజరాత్ టైటాన్స్​​ గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక, ఎలిమినేటర్ మ్యాచ్​లో గెలిచి క్వాలిఫయర్- 2లో అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక, డూ ఆర్ డై ఫైట్ క్వాలిఫయర్ -2మ్యాచ్​లో రాజస్థాన్​తో అమీతుమీ తేల్చుకోనుంది ఆర్సీబీ. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్​లో గుజరాత్​తో తలపడనుంది. ఓడిన జట్టు ఇక లగేజీ సర్దుకోవడమే. ఈ నేపథ్యంలో రెండు జట్ల పరిస్థితి.. వంటి విషయాలకు సంబంధించిన పది పాయింట్లను ఓసారి పరిశీలిద్దాం.

  1. టీ20 లీగ్‌లో రాజస్థాన్‌, బెంగళూరు జట్ల మధ్య ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించగా.. రాజస్థాన్ 11 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మరో రెండింటిలో ఫలితం తేలలేదు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌, బెంగళూరు రెండు సార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌ గెలిచాయి.
  2. రాజస్థాన్‌ ప్రధాన బలం జోస్‌ బట్లర్‌. ఈ సీజన్‌లో రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ చేరడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. బట్లర్‌ 15 మ్యాచ్‌ల్లో 718 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇందులో 3 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
  3. రాజస్థాన్‌ బౌలింగ్‌ దళంలో యుజువేంద్ర చాహల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ కీలకం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన చాహల్‌ (26) వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ 15 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
  4. ఈ సీజన్‌లో లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌ 9 మ్యాచ్‌ల్లో నెగ్గి ఐదింటిలో ఓడింది. క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌ చేతిలో పరాజయం పాలైంది.
  5. ఈ సారి బెంగళూరుకు కాస్త అదృష్టం కలిసొచ్చింది. దిల్లీపై ముంబయి విజయం సాధించడంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరింది.
  6. లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూపై విజయం సాధించి క్వాలిఫయర్‌-2కి అర్హత సాధించింది.
  7. బెంగళూరు బ్యాటింగ్‌లో కెప్టెన్‌ డుప్లెసిస్‌, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్‌, మ్యాక్స్​వెల్​తో పాటు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో శతకం బాదిన రజత్‌ పాటిదార్‌ కీలకం కానున్నారు.
  8. బెంగళూరు బౌలింగ్‌లో వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్ కీలకం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన హసరంగ 7.62 ఎకానమీతో 25 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. హర్షల్‌ పటేల్ 14 మ్యాచ్‌ల్లో 7.56 ఎకానమీతో 19 వికెట్లు తీశాడు.
  9. రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను వీలైనంత తొందరగా పెవిలియన్‌ చేర్చితే బెంగళూరుకు విజయావకాశాలు మెరుగవుతాయి.
  10. మొత్తం మీద టైటిల్‌ పోరుకు అర్హత సాధించేందుకు జరిగే క్వాలిఫయర్‌-2 రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బలాబలాల పరంగా చూస్తే రాజస్థాన్‌కే కాస్త విజయావకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. అయితే, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోలాగా బెంగళూరు సమష్టిగా రాణిస్తే రాజస్థాన్‌ ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పొచ్చు.

ABOUT THE AUTHOR

...view details